Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు దూతగానే ఢిల్లీకి పవన్: సినీడైలాగులతో విరుచుకుపడ్డ అంబటి

పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా ఏమైనా పంపించి ఉంటాడనేది నా అనుమానమన్నారు. ఆయన మాత్రం రాష్ర్ట ప్రయోజనాలకోసం వెళ్లాడని తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ysrcp mla ambati rambabu satirical comments on pawan kalyan, chandrababu
Author
Amaravathi, First Published Nov 15, 2019, 2:28 PM IST

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఎన్టీఆర్ ను మించిన మహానటుడు పవన్ కళ్యాణ్ అంటూ సెటైర్ లు వేశారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ బాగా నటిస్తున్నారంటూ విమర్శించారు. 

తాడేపల్లిలోని వైసీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబు ఆదేశాలమేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారని విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని చెప్తున్నారే తప్ప ఆయన చేసేవన్నీ అవేనన్నారు.  

తాటతీసి మూలన కూర్చోబెడతాను, జగన్ 16 నెలలు జైలులో ఉన్నారంటూ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా, పాలసీలపై మాట్లాడటమా అంటూ విమర్శించారు. వైయస్ఆర్ర కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. 

వైయస్ జగన్ ను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎక్కడనుంచి ప్యాకేజిలు వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హిందూవ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డిది ఏ మతమో వైయస్ జగన్ ది అదే మతం కదా అని చెప్పుకొచ్చారు. పరిపాలనకు, మతానికి ముడిపెట్టి జగన్ హిందూవ్యతిరేకి అని ముద్రవేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

జగన్ పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అసలు రాజకీయాలలో మతప్రస్తావన ఎందుకు తీసుకుతెస్తున్నారో చెప్పాలని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సిఎం డౌన్ డౌన్ అంటేనే కేసులు పెట్టారు. తామేం అలా చేయడం లేదన్నారు. 

ఇప్పటికే ఇద్దరు నేతలు వల్లభనేని వంశీ,అవినాశ్ వంటి వారు టీడీపీ నుంచి డౌన్ అయ్యారని గుర్తు చేశారు. జగన్ కి అటు ఇటు అయితే మీ పరిస్దితి ఏంటని పవన్ అడుగుతున్నారని  చంద్రబాబుతో కలిసి జగన్ ను ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని నిలదీశారు. 

జగన్ కి అటైనా, ఇటైనా, ఎటైనా జగన్ వెంటే నడుస్తామన్నారు. పదే పదే పెళ్లాలు గురించి మాట్లాడుతున్నారు మీరు కూడా చేసుకోండి అంటున్నారు. అయ్యా మీరు తప్పుచేశారని చెబితే మీరు కూడా తప్పులు చేయండి అని మాట్లాడుతున్నారు ఇదెక్కడి పరిస్థితి అని నిలదీశారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శిస్తే 3 నెలల మంత్రి పదవి ఎక్స్ టెన్సన్ వస్తుందంట, తాను విమర్శించకపోవడం వల్ల మంత్రి పదవి రాలేదని పవన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎక్కడ నుంచి ప్యాకేజీలు వస్తున్నాయో చెప్పాలని నిలదీశారు.  

జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. తెనాలిబాబు, లింగమనేని బాబులు కలసి మిమ్మల్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి ప్యాకేజిలు మాట్లాడిన సంగతి అందరికి తెలుసునని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు ఎవరికి చెబితే వారికి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారని అంటుంటే వారిని చూసి జాలివేస్తుందన్నారు. ఎవరో ఆయిల్ కొడితే మీ బండి నడుపుకుంటుంటే ఎలా అంటూ సెటైర్లు వేశారు. 

మీ ఆయిలే మీరు కొట్టుంచుకుని బండినడుపుకుంటే ఎంతబాగుంటుంది, దాని కిక్కే వేరబ్బ అంటూ సినిమా డైలాగులు చెప్పారు అంబటి రాంబాబు. చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడే ఇసుక కొరత వచ్చిందని దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

ఇసుక ,డబ్బులకో మరోదానికి కక్కుర్తి పడో ఇసుక కొరత సృష్టించామనేది అసత్యమన్నారు. ఇసుక కొరత అనేది కృత్రిమంగా సృష్టంచబడలేదన్నారు. ఇసుకనుంచి రాజకీయం తైలం తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఇసుక సంగతి అటుంచితే ఇంగ్లీషు భాష గురించి వివాదం సృష్టిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే తప్పేంటని నిలదీశారు. ప్రపంచ పోటీని ఎదుర్కొవడం కోసం సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లీషు ప్రవేశపెట్టబోతే విమర్శిస్తారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇది సరైన విధానం కాదన్నారు.

జగన్ గారి ప్రభుత్వంపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తే అది మీకే నష్టమన్నారు. 23 క్లైమోర్ మైన్స్ పెట్టినా భయపడలేదని చెప్తున్న చంద్రబాబు ఒక్క కేసిఆర్ ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చేశారంటూ ధ్వజమెత్తారు. 

అమరావతిలో చంద్రబాబు చేసిన నేరాలు ఘోరాలు బయటకు వస్తాయని తెలిపారు. పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా ఏమైనా పంపించి ఉంటాడనేది నా అనుమానమన్నారు. ఆయన మాత్రం రాష్ర్ట ప్రయోజనాలకోసం వెళ్లాడని తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

చంద్రబాబు చేసిన ఇసుకదీక్ష దొంగ దీక్ష అంటూ ఆరోపించారు. 6నెలలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయి వికృత రూపం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నచంద్రబాబు ఇసుకదీక్షలో డ్రామాలు ఆడారంటూ తిట్టిపోశారు. పలుగు, పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేశారని తెలిపారు. బొచ్చా, పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్ తో సైతం బాగా నటింపచేశారని విమర్శించారు. 

చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టుకుందని విమర్శించారు. వైయస్ జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 151 సీట్లతో వైయస్ జగన్ అధికారంలోకి వస్తే  ఆరునెలల్లోనే చంద్రబాబు కంగారు పడుతూ అందర్ని కంగారు పడమని చెప్తున్నారంటూ సెటైర్లు వేశారు.  

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి పై చర్యలు తీసుకుంటున్నారా లేదా గుండెపై చేయివేసుకుని చెప్పాలని నిలదీశారు. పొలిటికల్ అవినీతిని అరికట్టాలని జగన్ ప్రయత్నిస్తుంటే జే టాక్స్ అంటూ విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.  

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడపడితే అక్కడ మీ ఎమ్మెల్యేలు, మంత్రులే వసూలు చేశారని ఆరోపించారు. అది చూసిన జనం ఛీ కొట్టారు కాబట్టే 23 సీట్లకు పరిమితం అయ్యారంటూ విరుచుకుపడ్డారు.  

లిక్కర్ ధర రూ. 70 పెరిగిందని దాంట్లో కూడా దోచుకుంటున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఎన్నికలముందు చెప్పినట్లు లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తామన్నామని అందులో భాగంగానే దశలవారీగా మద్యనిషేధం తెస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ర్టంలో మద్యనిషేధంపై కూడా విమర్శలు చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

అన్నాక్యాంటిన్లు మూసివేశారు కాబట్టి జనం అల్లాడిపోతున్నారని అంటున్న చంద్రబాబు అసలు అన్నాక్యాంటిన్లు తెచ్చింది ఎప్పుడో చెప్పాలని నిలదీశారు. టీడీపీలా తాము ఎన్నికలకు ముందు పథకాలు తెచ్చి ప్రజలను మోసం చేయలేమన్నారు.

50 మంది భవన నిర్మాణకార్మికులు చనిపోయారని చెప్తున్న చంద్రబాబు ఎక్కడ ఎవరు చనిపోయారో చెప్తారా అంటూ నిలదీశారు. అధర్మంగా మాట్లాడొద్దంటూ హితవు పలికారు. లోకేష్,  చంద్రబాబులు శవరాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

వెనకబడిన వర్గాల వారంటే వైయస్ జగన్ కి కక్ష అంట కాబట్టి ఇసుక సమస్యను తెచ్చారంటూ టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వెనకబడిన వర్గాల వారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు టిడిపికి మద్దతుగా ఉన్నారని చంద్రబాబు మోసం చేయడంతో వారంతా జగన్ కు మద్దతు పలికారని తెలిపారు. ఇసుక దీక్షకు టిడిపి మెజారిటి ఎమ్మెల్యేలు హాజరుకాలేదని అది తప్పని ఆ ఎమ్మెల్యేలు భావించి ఉండి ఉంటారేమోనని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్: ఆ గ్యాప్ దక్కేనా....?

వైసీపీ పిలిస్తేనే వచ్చా, జగన్ ప్రభుత్వం గొప్ప పనిచేసింది: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు


 

Follow Us:
Download App:
  • android
  • ios