మంగళగిరి: రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబుపై కోపంతో జగన్ రాజధానిని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడుపై కోపంతోనో, గత ప్రభుత్వ విధానాలు నచ్చకనో రాజధానిని తరలించాలని చూస్తే అంతకంటే పెద్ద పొరపాటు మరోకటి లేదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఏం చేశారని నిలదీశారు. 

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు ఏకగ్రీవ తీర్మాణం చేశారు కదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు అబ్జక్సన్ చెప్పలేదన్నారు. అంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేస్తేనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయ్యిందన్నారు. 

అనంతరం ప్రధాని నరేంద్రమోదీ వచ్చి శంకుస్థాపన చేయడం అన్నీ జరిగిపోయాయన్నారు. నిర్మాణాలు కూడా జరిగిపోతున్న తరుణంలో రాజధానిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు పరోక్షంగా లీకులు ఇవ్వడం సరికాదన్నారు. 

రాజధాని నిర్మాణం ఆపేస్తే జగన్మోహన్ రెడ్డికి, బొత్స సత్యనారాయణలకు నష్టం జరగదన్నారు. రాష్ట్రప్రజలకు, రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు నష్టం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడం వల్ల కోటి మంది పస్తులతో, అప్పులతో బాధపడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా, రాజధానికోసం అన్ని ఎకరాల భూమి ఎందుకు అని సందేహం వస్తే సైజు కుదించాలే తప్ప తరలించే ప్రయత్నాలు చేయడం సబబు కాదన్నారు. అమరావతి నిర్మాణం జరిగితే భవన నిర్మాణ కార్మికులు బాగుపడతారని సూచించారు.  

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఏం చేశారంటూ తిట్టిపోశారు. రాజధాని భూసేకరణను అడ్డుకునే దమ్ము వైసీపీకి లేకుండా పోతే తనను ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. వైసీపీ పిలిస్తేనే తాను అమరావతి వచ్చాననని భూసేకరణను అడ్డుకుంది తానేని చెప్పుకొచ్చారు. జనసేనకు ఉన్న దమ్ము వైసీపీకి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

లేనిపక్షంలో పులివెందులలో రాజధాని పెట్టుకుంటారంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాను కూడా అక్కడకే వస్తానన్నారు. అమరావతి రాజధానిని పులివెందులలో పెట్టుకుంటానని 151 మంది ఎమ్మెల్యేలతో తీర్మానం చేయండంటూ ఎద్దేవా చేశారు. 

తాను ఏడాదిపాటు బయటకు రాకూడదనకున్నానని పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలనుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే వైసీపీ విధివిధానాలు నచ్చక బయటకు రావాల్సి వచ్చిందన్నారు. వచ్చేలా ప్రభుత్వం పనిచేసిందన్నారు. 

తాను రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదన్న పవన్ కళ్యాణ్ సగటు మనిషికి న్యాయం చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైసీపీ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తే అభినందిస్తానన్నారు. 

తన మాటలు విని వైసీపీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారంటూ చురకలంటించారు. తాను శాపనార్థాలు పెడుతున్నానని వారు భయపడుతున్నారంటూ సెటైర్లు వేశారు. శాపనార్థాలు పెట్టడానికి తాను ఎవరినన్నారు. తానేమీ రుషిని కాదన్నారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గొప్ప పని ఏదైనా చేసి ఉందంటే అది 50 మంది భవన నిర్మాణ కార్మికులను చంపడమేనన్నారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

ఇలాంటి ఘటనలే ఎమ్మెల్యేల ఇంట్లో జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా చీపురుపల్లిలో వీరంగం చెయ్యరా అంటూ మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు తమ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. చక్కటి పాలన అందించాలని సూచించారు. లేని పక్షంలో తాము తిరగబడాల్సి వస్తోందని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు చాలా బలమైన వారని సైద్ధాంతిక బలంతో రాజకీయాల్లోకి వచ్చిన వారేనని తెలిపారు. తమ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలన్నారు.  

ప్రస్తుత రాజకీయాల్లో కొందరు అవకాశాలను వెతుక్కుంటూ ఇతర పార్టీలకు వెళ్లిపోయారని జనసేనను వీడిన వారిపై పవన్ కళ్యాణ్ విమర్శించారు. దొడ్డిదారిలో జనసేనలో చేరాలనుకుంటే తాను అంగీకరించబోనన్నారు. 

జనసేన పార్టీకి, తనకు ప్రజల పక్షాన పార్టీ పక్షాన నిలబడేవాళ్లే కావాలన్నారు. ఐదేళ్లు ఒత్తిడి తట్టుకుని నిలబడకపోతే రాజకీయాల్లో నిలదొక్కుకోలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  జనసేనను కొందరు నేతలు వీడటం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.  

తన బలం, కార్యకర్తలు, అభిమానుల అండదండలు ఏంటో లాంగ్ మార్చ్ లోనే తెలిసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు వారి అనుబంధ రంగాలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పోరాటమే తమ పోరాటమని స్పష్టం చేటశారు.  

వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఆయన మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోయారంటూ జగన్ ఓదార్పు యాత్ర చేశారని కానీ 50 మంది చనిపోతే పట్టించుకోరా అంటూ నిలదీశారు. కనీసం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం అయినా చేశారా అంటూ ప్రశ్నించారు. 

చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను వైసీపీ ఆదుకోవాలని సూచించారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి భవన నిర్మాణ కార్మికుల కష్టాలు పట్టవా అని నిలదీశారు. 

వారి సమస్యలపై మాట్లాడేందుకు ఆర్కేకి మనసొప్పదా, ప్రగల్భాలు పలికేందుకేనా మీరు ఉన్నది అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇసుక కొరతను నివారించేలా చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సూచించారు. అలాగే ప్రజలకు మంచి పాలన అందించాలంటూ హితవు పలికారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్: ఆ గ్యాప్ దక్కేనా....?

తైతిక్కలాడేవాడి తల నేలకేసి కొట్టాలి: వైసీపీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం