అమరావతి: జనసేన  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హస్తినకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని తెలుస్తోంది. 

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు జాతీయ నేతలను పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రధాని నరేంద్రమోదీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే జనసేన పార్టీ నివేదిక సైతం సిద్ధం చేసిందని తెలుస్తోంది. నివేదికను కేంద్రప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నివేదికలో ఏయే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోరారని అవి ఖరారు కావడంతోనే ఢిల్లీకి ఆకస్మాత్తుగా బయలుదేరారని తెలుస్తోంది. 

ఇకపోతే బీజేపీకి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా ఢిల్లీకి బయలుదేరడం అంతకు ముందు టీడీపీ నేతలతో భేటీ కావడంపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతుంది. 

ఇకపోతే ఇటీవలే బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. డిసెంబర్ 3న విశాఖపట్నం వేదికగా నిర్వహించిన లాంగ్ మార్చ్ లో బీజేపీపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆయన్ను ఎలా నియంత్రించాలో తనకు తెలుసనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ దేశాన్ని పాలించే బలమైన వ్యక్తులు తనకు తెలుసని పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీ పెద్దలకు తనంటే ఇష్టమనేలా జనసేనాని వ్యాఖ్యలు చేశారు. ఇసుక సమస్యపై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని తెలిపారు. అంతేకాదు పలుమార్లు తాను కేంద్రానికి లేఖలు రాస్తానని అవసరమైతే మోదీని, అమిత్ షాను కలుస్తానంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇలా బీజేపీ పట్ల సానుకూలంగా అనేక సార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజధానిలో పర్యటించిన పవన్ ఆనాడు మోదీ, అమిత్ షాలను కలుస్తానని తెలిపారు. అంతేకాదు అమెరికాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను సైతం కలిశారు. అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. 

ఇలాంటి తరుణంలో బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు, కలయికలు చూస్తుంటే పవన్ బీజేపీతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు పంపుతున్నారని ప్రచారం జరరుగుతుంది. మరోవైపు బీజేపీ కూడా పవన్‌ పట్ల సానుకూలంగానే ఉందని సమాచారం. బీజేపీకి మిత్రపక్షంగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఏపీలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ సక్సెస్ కావడం, పవన్ కళ్యాణ్ పై ఎలాంటి అవినీతి ముద్ర లేకపోవడంతో బీజేపీ పవన్ తో దోస్తీకి రెడీ అంటుందని తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో తెగదెంపులు తెంచేసుకోవడం, వైసీపీతో గ్యాప్ రావడంతో పవన్ కళ్యాణ్ తోనే దోస్తి సరైందని బీజేపీ వ్యూహరచన చేస్తోందట.  

ఏపీలో జనసేన పార్టీకి కాస్త అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే. అలాంటి తెలుగుదేశం పార్టీతో బీజేపీ జతకట్టేందుకు ససేమిరా అంటుంది. అలాంటి తరునంలో బీజేపీ కోసం ఏపీలో టీడీపీని వదులుకునేందుకు పవన్ కళ్యాణ్ ఏమేరకు సన్నద్దులయ్యారనేది తెలియాల్సి ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

తైతిక్కలాడేవాడి తల నేలకేసి కొట్టాలి: వైసీపీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం