అమరావతి: రాజకీయంగా చంద్రబాబునాయుడు కొంప ఎప్పుడో మునిగిపోయిందని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.వరద ప్రవాహం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున కరకట్టపై ఉన్న  ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని చంద్రబాబును ఆయన కోరారు 

శనివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. భారీగా వరద పోటెత్తుతున్నా కూడ మొండిగా చంద్రబాబునాయుడు ఇక్కడే ఉండడం సరైంది కాదన్నారు. 

కృష్ణా నదికి పదేళ్ల క్రితం భారీ ఎత్తున వరద వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  చంద్రబాబు ఆరోపణలు, కుట్రలు అనవసరమని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.

నదీ ప్రవాహంలో ఉండొద్దని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పామని ఆయన గుర్తు చేశారు.అయినా కూడ చంద్రబాబునాయుడు మొండితనంతో ఇక్కడే ఉంటున్నారని ఆయన మండిపడ్డారు.తక్షణమే ఇంటిని ఖాళీ చేసి చంద్రబాబు వెళ్లిపోవాలని  అంబటి రాంబాబు సూచించారు.తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి బలికాక తప్పదన్నారు.