అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పంచ్ లపై  పంచ్ లు వేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణానది కరకట్టపై వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతపై జరిగిన చర్చలో అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. 

అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్న చంద్రబాబు తన తప్పును ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిచారు. చట్టాలను ఎన్నటికీ అతిక్రమించను. సభాసంప్రదాయాలు పాటిస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తాను అంటూ పదేపదే అంటున్న చంద్రబాబు అక్రమ ఇంట్లో ఉండటంపై ఏం సమాధానం చెప్తారంటూ నిలదీశారు. 

అంతేకాదు చంద్రబాబు మాటలు వింటుంటే నా రక్తం మరిగిపోతోందని అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. గత అసెంబ్లీలో బీజేపీని ఉద్దేశిస్తూ చంద్రబాబు నారక్తం మరిగిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను గుర్తు చేయడంతో అంతా పగలబడి మరీ నవ్వారు. 

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడిందే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్టాడటం సబబు కాదన్నారు. గత ప్రభుత్వంలో 23  మంది  వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 

ఇవన్నీ చేసికూడా సభా నియమాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఉపన్యాసాలిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. శభాష్‌ చంద్రబాబు అంటూ అంబటి చురకలంటించారు. లింగమనేని అక్రమ కట్టడంలో నివాసముంటున్న చంద్రబాబు అక్కడ నుంచి ఖాళీ చేసి గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.