ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించే హక్కు లేదు: బాబుపై అంబటి ఫైర్
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు టూర్ సమయంలో తనపై చేసిన విమర్శలపై అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
అమరావతి:ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు లేదని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారంనాడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరిపే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు.
బతికున్న సమయంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను మీడియా సమావేశంలో అంబటి రాంబాబు ప్రదర్శించారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగజేబుతో పోల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో ఎంతో ఆవేదన చెందారని అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు కారణంగానే ఎన్టీఆర్ మనోవేదనకు గురయ్యారన్నారు. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని ఆయన ఎన్టీఆర్ అభిమానులను కోరారు. తండ్రిలాంటి మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ చెప్పిన మాటలను అంబటి రాంబాబు ప్రస్తావించారు.
also read:గన్నవరం చేరుకున్న రజనీకాంత్: స్వాగతం పలికిన బాలకృష్ణ
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనం రావడం లేదన్నారు. చంద్రబాబువన్నీ అట్టర్‌ప్లాఫ్ షో లేనన్నారు. తాను గంగమ్మ అనే మహిళ వద్ద రెండు లక్షలు లంచం అడిగినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలను అంబటి రాంబాబు తప్పుబట్టారు. ఈ విషయమై అసలు ఏం జరిగిందో అంబటి రాంబాబు వివరించారు. గంగమ్మ తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఆమెకు రూ. 4 లక్షలు పవన్ కళ్యాణ్, రూ. 2 లక్షలు చంద్రబాబు ఇచ్చారని రాంబాబు తెలిపారు. తాను లంచం తీసుకొనేవాడినో ,కాదో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు.