సూపర్ స్టార్ రజనీకాంత్  ఇవాళ  గన్నవరం  చేరుకున్నారు.  ఎన్టీఆర్ శతజయంతి  వేడుకల అంకురార్పణ సభలో  రజనీకాంత్  పాల్గొంటారు. 

అమరావతి: సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారంనాడు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రజనీకాంత్ కు సినీ నటుడు , ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ ఇవాళ గన్నవరం చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో బాలకృష్ణను రజనీకాంత్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ కార్యక్రమానికి వచ్చినందుకు రజనీకాంత్ కు భాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రజనీకాంత్, బాలకృష్ణ ఒకే కారులో నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. నోవాటెల్ హోటల్ లో రజనీకాంత్ తో బాలకృష్ణ కొద్దిసేపు మాట్లాడారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రజనీకాంత్ కు చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. 

పోరంకిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ప్రసంగానికి సంబంధించిన రాసిన రెండు పుస్తకాలను ఇవాళ విడుదల చేస్తారు రజనీకాంత్ . పలు బహిరంగ సభలు , అసెంబ్లీ, ఇతర వేదికలపై ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలను పుస్తకాలుగా రూపొందించారు.

ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం సభను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజనికాంత్, నందమూరి బాలకృష్ణ , ప్రముఖ జర్నలిస్ట్ వెంకటనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు