ఎన్నికల కమీషన్ ముసుగులో వెనుకుండి నడుపుతున్న దుర్మార్గులకు సుప్రీం తీర్పు చెంప పెట్టులాంటిదని రాంబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీం తీర్పుతో ఎన్నికల కమీషన్ పరిధి దాటిందని అర్థమవుతోందన్నారు. రాజకీయ కోణంలోనే ఎన్నికలను వాయిదా వేశారని అంబటి తెలిపారు. ఎవరినీ సంప్రదించకుండానే ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారని అంబటి మండిపడ్డారు.

అత్యంత రహస్యంగా ఆర్డర్‌ను తయారు చేయించి ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయించారని రాంబాబు ధ్వజమెత్తారు. అదే సమయంలో తిరిగి ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేదని, కానీ ఎన్నికల కోడ్ మాత్రం తూచా తప్పకుండా అమలవుతుందన్న దానిపై సుప్రీం అభ్యంతరం తెలిపిన విషయాన్ని రాంబాబు గుర్తుచేశారు.

Also Read:ఇప్పటికైనా మారండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో జగన్‌కు అచ్చెన్న చురకలు

ఇది అతిక్రమణ అని, రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా మీరు ప్రయత్నం చేస్తున్నారని ఈసీకి చురకలు వేసిందని అంబటి అన్నారు . తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించాలని కూడా ఈసీ తెలిపిందని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు, ఉపసంహరణ, పరిశీలన వంటి దశలు దాటి పోలింగ్ ఒక్కటే మిగిలివున్న దశలో స్థానిక ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేశారని రాంబాబు ధ్వజమెత్తారు.

ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా లేదని ఈ లోపు ఎన్నికల నిర్వహణ పూర్తయిపోతే సర్పంచ్‌లు, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల సేవలను వినియోగించుకునే వాళ్లమని అంబటి అభిప్రాయపడ్డారు. .

కేంద్ర ఎన్నికల కమీషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, వారు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారాని, కానీ రాష్ట్ర ఎన్నికల సంఘంలో అలాంటి స్ధితి ఉండదని రాంబాబు చెప్పారు. ఎన్నికల్లో రాజకీయ జోక్యాలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌లోనూ ముగ్గురు సభ్యులు ఉండాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

పరువు నష్టం దావా వేసుకుంటామని చెబుతున్న వాళ్లు నిరభ్యంతరంగా ముందుకు వెళ్లొచ్చని.. తాము గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నామని రాంబాబు స్పష్టం చేశారు.

కరోనా కారణంగా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లను మూసివేశారని.. కానీ ఆంధ్రప్రదేశ్ మొదటి దశలోనే ఉందని అంబటి వెల్లడించారు. ఎన్నికల వాయిదా వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు వున్నారని ఆయనే నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు.