సదావర్తి భూములు కాజేయాలనుకున్న చంద్రబాబు ప్లాన్ అడ్డం తిరిగిందా? వందల కోట్లు విలువచేసే భూములను చవకగా రూ.20కోట్లకు కాజేద్దామని చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారా? అవుననే అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.

 

అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని సదావర్తి భూమలును ప్రభుత్వం రూ.20కోట్లుకు తమ వారికి కట్టబెట్టింది. వాటి విలువ ఎక్కువగా ఉంటుందని.. అంత తక్కువగా ఇవ్వడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల హైకోర్టుకు వెళ్లడం.. కోర్టు ఆర్డర్లతో మరోసారి వేలం నిర్వహించాల్సి రావడం ఇవన్నీ అందరికీ తెలిసిందే.

అయితే..నాలుగు రోజుల కిందట నిర్వహించిన వేలం పాటలో శ్రీనివాసరెడ్డి అనే బిల్డర్.. ఆ భూములను రూ.60కోట్లకు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వేలం పాడిన డబ్బులను చెల్లించనంటూ మొండికేసి కూర్చున్నాడు. అందుకు కారణం వైసీపీ నేతలే అంటూ కొత్త పాట పాడుతున్నాడు.

 

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి  గురువారం స్పందించారు.  ఈ భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  ప్రభుత్వమే వేలం పాట ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఆ భూమలను తాను వేలంలో దక్కించుకుందామనకుంటే.. లోకేష్ నన్ను బెదిరించాడని..అయినా తాను బెదరలేదని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మాపై నిందలు వేడయం సరికాదన్నారు. సదావర్తి భూములను చంద్రబాబు, లోకేష్ కాజేశారన్న విషయం ప్రజలకు అర్థమైందని అందుకే.. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డితో హైడ్రామా ప్రారంభించారని ఆళ్ల ఆరోపించారు.

చంద్రబాబు, లోకేష్ ఆ భూములను కాజేయాలని ప్రణాళిక రచించారని ఆయన ఆరోపించారు. వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న ఆయనను తాము అభినందించి, స్వాగతించామన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ అడ్డుపడుతున్నామని ఆరోపిస్తున్నారు. భూముల వేలంపాటకి మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధం ఏమిటని.. వారంతా చెన్నై వచ్చి ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణులకు న్యాయం చేసేందుకే తాను కోర్టుకు ఎక్కానని ఆళ్ల స్పష్టం చేశారు.కోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతించామన్నారు. ఇక వేలంపాటపై మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయా శాఖ కమిషనర్‌ చెప్పే మాటలకు పొంతన లేదన్నారు.