నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బీజేపీ అభ్యర్ధి నామినేషన్ ను వైసీపీ నేతలు ఉపసంహరింపచేశారు. అభ్యర్ధికి తెలియకుండానే ఈ నామినేషన్ ఉపసంహరించడంతో బాధితురాలు కలెక్టర్‌కు, ఆర్డీఓకి ఫిర్యాదు చేసింది.

నెల్లూరు జిల్లాలోని రావూరు మేజర్ గ్రామ పంచాయితీకి సర్పంచ్ గా వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) అభ్యర్ధిగా భూపతి జయమ్మ, బీజేపీ అభ్యర్ధిగా శంకరమ్మలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీన శంకరమ్మ నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత శంకరమ్మ రెండు రోజులుగా నెల్లూరులోనే ఉంది.

అయితే ఈ నెల 16న శంకరమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరో వ్యక్తితో ఆమె నామినేషన్ ను ఉపసంహరించారు. దీంతో రావూరులో వైసీపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు.అయితే ఈ విషయం తెలుసుకొన్న బీజేపీ నేతలు షాక్ కు గురయ్యారు. వెంటనే నేతలు సర్పంచ్ అభ్యర్ధి శంకరమ్మను తీసుకొని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకు కూడ ఇదే విషయమై బీజేపీ నేతలు వినతి పత్రం అందించారు.

తనకు న్యాయం చేయాలని సర్పంచ్ అభ్యర్ధి శంకరమ్మ కోరుతున్నారు. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని బీజేపీ నేతలు తెలిపారు.