సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని హితవు పలికారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని విశ్వేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులకు ఆరాధ్యులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, వారు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయన సూచించారు. టీడీపీ నేతలు దిగజారుడు మాటలు మానుకోవాలని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రాయలసీమలో దాదాపుగా జలయజ్ఞం పనులు పూర్తయ్యాయని, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదన్నారు. మొదట దఫా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటి హక్కులు కోల్పోయామంటే దానికి కారణం చంద్రబాబేనని ధ్వజమెత్తారు.
చంద్రబాబు హయాంలో కర్ణాటకలో నీటి ప్రాజెక్టులు కట్టారని, ఆయన వాటిని కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు వైఎస్‌ఆర్ వేల కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టుకు సామర్ధ్యం పెంచడానికి చంద్రబాబు ఈ మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. హంద్రీనీవాకు ఏం చేశారని మండిపడ్డారు. హంద్రీనీవాపై వైఎస్‌ఆర్ ఆరున్నర వేల కోట్లు ఖర్చు చేశారని చంద్రబాబు కనీసం 300 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న డిస్ట్రిబ్యూటరీని కూడా పూర్తి చేయలేదన్నారు. 40 టీఎంసీల హంద్రీనీవాను 5 టీఎంసీలుగా మార్చాలనే జీవో ఇచ్చింది చంద్రబాబు కాదా, ఆ నిజం ప్రజలకు తెలియదా అని మండిపడ్డారు. రాయలసీమపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
