ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకే మళ్లీ ప్రజలు పట్టం కడతారని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. లోటు బడ్జెట్ లో వున్న రాష్ట్రాని  అభివృద్దిపథంలోకి తీసుకెళ్లాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడినే మళ్లీ సీఎం  చేయాలని ఆంధ్రా ఓటర్లు భావించారంటూ  వివరణ కూడా ఇచ్చారు. ఇలా లగడపాటి ఎన్నికల సర్వేలు వెలువడడానికి ఓ రోజు ముందే ఏపి రాజకీయాల్లో వేడి రగిల్చారు. 

అయితే లగడపాటి వ్యాఖ్యలు వైఎస్సార్‌సిపికి వ్యతిరేకంగా వుండటంతో ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ''40 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి దివాలా తీశాడు. దీన్ని ఆసరాచేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదిరించాడు. తెలంగాణా ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి వెయ్యి కోట్లు సంపాదించారు. మళ్లీ సేమ్ డ్రామా.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్  ద్వారా ద్వజమెత్తారు. 

 ''బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్ పై పెట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 లోగా బుకీలు సేఫ్.'' అంటూ లగడపాటి సర్వే వెనుక వున్న  రహస్యమిదేనని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 

''మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడు.ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయేదానికి ఎందుకులే అని  తప్పుకున్నాడు. ఇప్పుడే పార్టీతో సంబంధం లేదని కోస్తున్నాడు. కన్నాలేసే దొంగకు ఏఇంట్లో దూరితే ఏం దొరుకుతుందో అంచనా వేసే సిక్త్స్ సెన్స్ ఒకటి ఉండి చస్తుంది.'' అంటూ లగడపాటిపై విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.