శ్రీకాకుళం: మే 23 తర్వాత తెలుగుదేశం పార్టీ ప్యాకప్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు మాజీమంత్రి వైసీపీ నేత తమ్మినేని సీతారాం. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుందని తెలిసి కార్యకర్తల్లో, నేతల్లో, ప్రజల్లో భయం పోగొట్టేందుకు జమ్మిక్కులు చేస్తున్నారంటూ విరుచకుపడ్డారు. 

ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో విమానాల్లో ప్రయాణిస్తూ విపక్షాలను ఏకం చేస్తున్నట్లు చెప్తున్నారని విమర్శించారు. అసలు ఎన్ని పార్టీలను ఏకం చేశారో చంద్రబాబు చెప్పగలరా అని నిలదీశారు. 

బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లు మీతో కలిసే ప్రసక్తే లేదని పోమ్మని ఛీ పెట్టారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీలు కలిసొచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు తమ్మినేని సీతారాం.  

ప్రజల సొమ్ముతో విమానాల్లో ప్రయాణిస్తూ దుబారా ఖర్చులు చేస్తున్నారని దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. మే 23న వెల్లడయ్యే ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారంటూ జోస్యం చెప్పారు వైసీపీ నేత తమ్మినేని సీతారాం.