హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ సర్వేపై  వైఎస్ఆర్‌సీపీ  కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శైలజాచరణ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

ఈ సర్వేను లత్కోర్ సర్వేగా ఆమె పేర్కొన్నారు. ఆంధ్ర బెట్టింగ్ బుకీలతో డీల్ కుదుర్చుకొని బోగస్ సర్వేను ఆయుధంగా విడుదల చేశారన్నారు.  లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. లగడపాటి సర్వేలకు కాలం చెల్లిందన్నారు.

లగడపాటి సర్వేలు బెట్టింగుల కోసమేనని అందరికీ తెలుసునని ఆమె విమర్శించారు. తెలంగాణలో మహాకూటమి గెలుస్తోందని లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయని ఆమె గుర్తు చేశారు. 

ప్రస్తుతం అదే తప్పిదాన్ని కూడ పునరావృతం కానున్నాయన్నారు.  బోగస్ సర్వే విడుదల చేసిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ జగన్‌ సీఎం కావడం తథ్యమన్నారు.

ఎన్నికల ఫలితాలపై లగడపాటి జ్యోతిష్యం చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారని వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ విమర్శించారు. బెట్టింగ్ రాయుళ్లను తప్పుదోవ పట్టించేందుకు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారని ఆయన  ఆరోపించారు.