ఎన్నికల కమీషనర్ కీలుబొమ్మలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తోందని సజ్జల ఎద్దేవా చేశారు.

రిటైర్డ్ అధికారి అయి వుండి ఇతర అధికారులపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చవకబారు ధోరణిలోనే నిమ్మగడ్డ వ్యవహరించారని సజ్జల ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేతిలో రమేశ్ కుమార్ కీలుబొమ్మగా మారారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారని... తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ అధికారులపై చర్యలకు నిమ్మగడ్డ లేఖ రాశారని ఆయన ఆరోపించారు.

Also Read:ఐఎఎస్ అధికారులపై ఎస్ఈసీ ప్రొసిడింగ్స్: తిప్పి పంపిన సర్కార్

లేఖలోని అంశాలు నిమ్మగడ్డ అహంభావాన్ని సూచిస్తున్నాయని...  అధికార యంత్రాంగాన్ని అస్థిరపరచాలని ఎస్ఈసీ సూచిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సీనియర్ అధికారుల పట్ల ఎస్ఈసీ వాడిన భాష సరికాదని సజ్జల అభ్యంతరం తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని... చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జనవరి 16న సీఈసీ ఓటర్ల జాబితాను విడుదల చేసిందని... గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే 2 నెలల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

రెండు నెలల తర్వాత కానీ ఎన్నికలు జరపలేమని నిమ్మగడ్డకు కూడా తెలుసునని.. అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల్లో, అధికారుల్లో టెర్రర్ క్రియేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని.... ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచనలను అమలు చేసేలా నిమ్మగడ్డ నిర్ణయాలు ఉంటున్నాయని.. ఎస్ఈసీ ఇచ్చే అడ్డగోలు ఆర్డర్స్‌ను ప్రభుత్వం అమలు చేయదని సజ్జల స్పష్టం చేశారు.