ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ప్రకటించడంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నుంచి తెలంగాణలో పార్టీ వైఖరిపై ప్రశ్నలు వస్తూనే వున్నాయని స్పష్టం చేశారు.

జగన్ మోహన్ రెడ్డిది ఒకే వైఖరి అని..  విభజన తర్వాత రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసుకోవాలని సజ్జల చెప్పారు. తెలంగాణ వెళ్లి ఏ ప్రయత్నం చేసినా గ్యాప్ వస్తుందని జగన్ భావించారని.. అందుకే తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు వద్దని జగన్ అన్నారని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రాజకీయాలు చేస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని జగన్ భావించారని ఆయన వెల్లడించారు. షర్మిలమ్మ గురించి తెలియదంటే బుకాయించినట్లే అవుతుందని.. రెండు మూడు నెలలుగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు.

Also Read:జగన్ ఏపీలో పనిచేస్తున్నాడు, నేను తెలంగాణ కోసం పనిచేస్తా: షర్మిల

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి.. తెలంగాణాలో ఎందుకు జరగకూడదని ఆమె ఆలోచన కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆలోచనకు వైసీపీ వ్యతిరేకమని సజ్జల స్పష్టం చేశారు.

తెలంగాణకు వెళ్తే వచ్చే ఇబ్బందుల గురించి షర్మిలకు చెప్పామని.. కానీ ఆమె సొంతంగా ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. షర్మిల పార్టీతో వైసీపీకి ఏ సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

మా మధ్య భిన్నాభిప్రాయాలు వున్నాయి కానీ విభేదాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. షర్మిల వైసీపీ లైన్ దాటారని.. తెలంగాణ రాజకీయాలపై జగన్ స్పష్టమైన వైఖరితో వున్నారని ఆయన వెల్లడించారు.

ఏపీ సర్కార్‌తో తలపడతామని అన్నవాళ్లు ఎవరో, వారి స్థాయి ఏంటో నాకు తెలియదన్నారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి వున్నదున్నట్లు చెప్తుందే తప్ప.. రాజకీయ వ్యూహాలుండవని సజ్జల స్పష్టం చేశారు.

అంతకంటే పెద్ద పెద్దవే జరిగాయని.. ఇవి నిలబడతామని అనుకోమన్నారు. జగన్ , షర్మిల మధ్య వ్యక్తిగత విబేధాలు వుండని రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది ఏమీ లేదని.. సహకరించారు కాబట్టే షర్మిల పాదయాత్ర చేశారని సజ్జల గుర్తుచేశారు.

పార్టీలో పదవులు ఇవ్వలేని ఆమె ఇంకో పార్టీ పెట్టారని అనుకోవట్లేదన్నారు. వైఎస్ మార్గదర్శకత్వంలో షర్మిల పార్టీ పెట్టాలనుకుంటున్నారని చెప్పారు. అయితే జగన్ విషెస్ ఉంటాయనే అనుకుంటున్నానని.. అలాగే షర్మిలకు తన శుభాకాంక్షలు తెలిపారు సజ్జల. పార్టీ విషయంలో షర్మిలమ్మ జగన్‌తో సంప్రదించలేదని.. పార్టీ ఏర్పాటు సాహసోపేత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.