ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఏదైనా ప్రయోజనం వుందా అని ఆయన ప్రశ్నించారు.

మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవ్వడైనా ఈ మాట అంటారా అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. 60 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి, వేలాది కోట్లు పెట్టి కొనుగోలు చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని జగన్‌పై ప్రశంసలు కురిపించారు.

ముఖ్యమంత్రి ఇలాంటి విషయాలపై పబ్లిసిటీ కావాలని కోరుకుంటాడా లేదంటే ఆలయాలను ధ్వంసం చేసి ప్రచారం అడుగుతాడా అని సజ్జల ప్రశ్నించారు. వైసీపీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా సున్నితమైన, మతపరమైన అంశాల మీద ఏ రోజైనా తాము ఉద్యమాలు చేపట్టామా అని రామకృష్ణారెడ్డి నిలదీశారు.

క్షణికావేశంతోనో, కోపంతోనే తాము ఏనాడైనా ఉద్యమాలు చేపట్టామా అని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల పని ప్రజల సమస్యలు తీర్చడం, ప్రజల గురించి ఆలోచించడం మాత్రమేనని.. దేవాలయాలు, మతపరమైన అంశాలు చూసుకోవాల్సింది స్వామిజీలేనన్నారు.

Also Read:ఏపీలో ఆలయాలపై దాడులు: చినజీయర్ ఆగ్రహం.. విచారణకు డిమాండ్

మతం పూర్తిగా వ్యక్తిగతమైనదని.. ఎవరి విశ్వాసాలు వాళ్లవేనన్నారు. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని.. భద్రత లేని గుళ్లను కొందరు టార్గెట్ చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

కులాలు మీద రాజకీయాలు అయిపోవడంతో టీడీపీ నేతలు ఇప్పుడు మతాలపై పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని సజ్జల ఆరోపించారు.

మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయడం ద్వారా బీజేపీకి దగ్గరవ్వడంతో పాటు జగన్ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయొచ్చని టీడీపీ వ్యవహరిస్తోందని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. స్వామిజీలు, మఠాధిపతులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.