ఏపీలోని ఆలయాల్లో తగినంత రక్షణ కరువైందన్నారు చినజీయర్ స్వామి. విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... అంతర్వేది రథం దగ్ధం, రామతీర్ధం ఘటనతో ఆందోళన తీవ్రతరమైందని స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరాయకొండ నరసింహస్వామి చేతుల ధ్వంసం శోచనీయమన్నారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని.. ఉపద్రవాలు జరిగినప్పుడు తక్షణ కర్తవ్యంపై దృష్టి పెట్టాలని చినజీయర్ స్వామి సూచించారు.

ఎవరు చేస్తున్నారనేది అప్రస్తుతం.. కానీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. దాడులకు గురైన ఆలయాలను సందర్శించి, స్థానికుల అభిప్రాయాలను తెలుసుకోవాలని.. ధర్మ జాగరణ చేసే పెద్దలను కలిసి ఏం చేయాలో ఆలోచిస్తామని చినజీయర్ స్వామి తెలిపారు.

రక్షణ కోసం కెమెరాలు పెట్టాలనే ఆదేశాలున్నా అమలు కావడం లేదని.. ఆలయాల్లో బాధ్యులుగా ఉండే వ్యవస్థను నిర్మూలించి, పాలనాపరంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు వరుస దాడులతో లోపాలు బయటపడుతున్నాయన్నారు.

ఈ నెల 17న ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తానని... దాడులు జరిగిన ఆలయాలను సందర్శించి, అక్కడి ప్రజలతో మాట్లాడతానని చినజీయర్ వెల్లడించారు. ఆలయాల ఉనికికి భంగం వాటిల్లినప్పుడు మౌనం సరికాదని... ఇంటెలిజెన్స్ విభాగంతో స్పష్టమైన కమిటీ వేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏ మతానికి చెందిన ఆలయంపై దాడి జరిగినా తప్పేనని... ప్రార్ధనా మందిరాలపై దాడి జరిగి ఉంటే ప్రపంచమంతా స్పందించేదని చినజీయర్ అభిప్రాయపడ్డారు.

మతపరమైన విషయాల్లో రాజకీయ పార్టీలను ముడిపెట్టడం తగదని.. తమకు  రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చినజీయర్ స్పష్టం చేశారు. ఒకరిపై నేరారోపణ చేయాలని అనుకోవడం లేదని... ప్రభుత్వం, సమాజం స్పందించాలని ఆయన కోరారు.