ఇప్పుడు జగన్‌పై అస్త్రంలా .. 2024 ఎన్నికల తర్వాత సునీతమ్మను పక్కనపెడతారు : సజ్జల సంచలన వ్యాఖ్యలు
2024 ఎన్నికల తర్వాత సునీతను చంద్రబాబు , టీడీపీ పట్టించుకోకుండా అనాథలా వదిలేస్తారని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం, ఏ అస్త్రం లేక గుంట నక్కలు సీబీఐ దర్యాప్తును వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల తర్వాత సునీతను చంద్రబాబు , టీడీపీ పట్టించుకోకుండా అనాథలా వదిలేస్తారని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా సొంత పార్టీ నేతతో మేం మాట్లాడితే కొత్తేం వుందని సజ్జల ప్రశ్నించారు. ఎన్నికలకు నెల రోజుల ముందు మాట్లాడకుండా వుంటామాని అని ఆయన నిలదీశారు.
చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు నాతో కూడా మాట్లాడారని సజ్జల తెలిపారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారని రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో దోషులు బయటికి రావాలని మొదటి నుంచి కోరుతున్నామని సజ్జల పేర్కొన్నారు. ఏ స్టేట్‌మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే వున్నాయని.. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు మార్చారని రామకృష్ణారెడ్డి అన్నారు.
సునీతను ప్రెస్‌మీట్ పెట్టాల్సిందిగా తాను చెప్పలేదని.. భారతి తాను కలిసి సునీత ఇంటికి వెళ్లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగిందని రామకృష్ణారెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని.. అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఆయన గెలుపుకోసం వివేకా పనిచేశారని సజ్జల తెలిపారు. ఆ రోజు కేంద్రం, రాష్ట్రం , ప్రధాన ప్రతిపక్షం కుటుంబాన్ని విడదీసి వైఎస్ జగన్‌ను ఓడించాలని అనుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టికెట్ ఇచ్చేది, షర్మిలను వివేకా ఒప్పించినా టికెట్ ఇవ్వాల్సింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు.
నా గ్రూప్, నా బలం అనుకోవడానికి ఇదేమైనా కాంగ్రెస్ పార్టీనా అని సజ్జల పేర్కొన్నారు. చిన్నాన్న గురించి పరుషంగా మాట్లాడవద్దని జగన్ ఎన్నికలప్పుడు చెప్పారని రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీకి పెద్ద దిక్కుగా వున్న వ్యక్తిని ఎన్నికలకు నెల రోజుల ముందు ఎవరైనా హత్య చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా వివేకా ఓడిపోవడంతో మా అందరికీ షాక్ తగిలినట్లయ్యిందన్నారు. వివేకా హత్య వెనుక పడి, పన్నెండు కారణాలు కనిపిస్తాయని సజ్జల తెలిపారు.
వివేకా చనిపోయాక కొన్నిరోజులకు తన భార్యతో కలిసి పరామర్శించేందుకే వెళ్లానని రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకా వస్తే సాదరంగా ఆహ్వానించి పార్టీలోకి వైఎస్ జగన్ తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. తనను బెదిరించారని షమీమ్ స్టేట్‌మెంట్‌లో వుందని.. ల్యాండ్ సెటిల్‌మెంట్‌తో వచ్చేది ఏమీ లేదని ఎర్రగంగిరెడ్డికి ముందే తెలుసునని సజ్జల పేర్కొన్నారు. సీబీఐ అందరి వాంగ్మూలం తీసుకున్నాకే దస్తగిరి అప్రూవర్‌గా మారాడని చెప్పారు. శివప్రకాష్ రెడ్డి బెదిరించారని షమీమ్ స్టేట్‌మెంట్ ఇస్తే.. ఆ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదని సజ్జల పేర్కొన్నారు.
సీఎం జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం, ఏ అస్త్రం లేక గుంట నక్కలు సీబీఐ దర్యాప్తును వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియా ఉగ్రవాదుల కంటే ఎక్కువ బెదిరింపులకు పాల్పడుతోందని సజ్జల విమర్శించారు. ఇప్పటికే ఒకసారి కోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన దుయ్యబట్టారు. 2024 ఎన్నికల వరకు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తేంటారని.. 2024 ఎన్నికల తర్వాత ఎల్లో మీడియా , టీడీపీ వారిని పట్టించుకోదన్నారు.