కేబినెట్ పునర్వ్యస్ధీకరణ సందర్భంగా  కొన్ని వర్గాలకు న్యాయం చేయలేకపోయిన మాట నిజమేనన్నారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజా మంత్రి వర్గంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించామని ఆయన తెలిపారు. 

వైసీపీ (ysrcp) తొలి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తోందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదని, బ్యాక్‌బోన్ క్లాసులని జగన్ (ys jagan) స్పష్టం చేశారని సజ్జల గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా తొలి కేబినెట్‌లో 25 మంది మంత్రులకు గాను 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులు కట్టబెట్టి సాహసం చేశారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. గతంలో అలాంటి విప్లవాత్మక చర్యలు జరగలేదన్నారు. 

తాజా కేబినెట్‌లో బీసీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీ 1, 8 మంది ఓసీలకు స్థానం కల్పించామని సజ్జల తెలిపారు. బీసీల ప్రాధాన్యతను 70 శాతానికి పెంచామని ఆయన వెల్లడించారు. పేదలకు తాయిలాలు ఇవ్వకుండా జగన్ పాలనలో భాగం కల్పించారని సజ్జల ప్రశంసించారు. చంద్రబాబు కేబినెట్‌లో (chandrababu naidu) 48 శాతమే బడుగు బలహీన వర్గాల వారు వున్నారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పాత కేబినెట్‌లోని 11 మందికి మరోసారి అవకాశం కల్పించామని సజ్జల తెలిపారు. ఇప్పటి వరకు కేబినెట్‌లో ముగ్గురు మహిళలుండగా .. ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారని రామకృష్ణారెడ్డి అన్నారు. 

ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్ధీకరణ కాదని సజ్జల స్పష్టం చేశారు. సామాజిక న్యాయం నినాదం కాదు.. నిజం చేశామన్నారు. అన్ని అంశాలు పరిశీలించాకే కేబినెట్ తుది జాబితా రూపొందించామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదంటూ సజ్జల దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకే బీసీలకు పదవులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాల్లో పెద్ద మొత్తంలో స్థానాలు కల్పించడం ఇదే తొలిసారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎవరినీ ప్రాధాన్యతా తగ్గదని .. దీని గురించి అపోహలు పెట్టుకోవద్దని ఆయన నేతలకు సూచించారు. పార్టీ విధానం కాబట్టి ఎవరూ సీరియస్‌గా తీసుకోరని సజ్జల తెలిపారు. 

వున్న 25 మంత్రి పదవుల్లో ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన బీసీలకు ప్రాధాన్యత కల్పించామని.. దీని వల్ల మిగిలిన వర్గాల వారు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇబ్బందిపడిన వారికి మరోచోట అవకాశం ఇస్తామని సజ్జల హామీ ఇచ్చారు. కేబినెట్‌లో 25 మందికి అవకాశం వున్నప్పుడు.. 19 మందితోనే చంద్రబాబు ఎందుకు ప్రభుత్వాన్ని నడిపారో అర్ధం కావడం లేదన్నారు. అప్పుడు ఎన్టీఆర్ (nt rama rao) రాజీనామా చేయమంటే మంత్రులంతా రాజీనామా చేశారని.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో అలా జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది మంత్రులకు జగన్‌పై వున్న విశ్వాసం, నమ్మకం వల్లేనని ఆయన అన్నారు. ముందు నుంచి మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ గురించి జగన్ చెబుతూ వచ్చారని సజ్జల గుర్తుచేశారు.