అమరావతి కుంభకోణం దేశంలోని అతిపెద్దదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజధానిలో పెద్ద కుంభకోణం జరిగిందని తాము ముందు నుంచి చెబుతూనే వున్నామని అంబటి వ్యాఖ్యానించారు.

బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందని.. త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి రాబోతున్నాయని అంబటి స్పష్టం చేశారు.

చట్టాలను, సరిహద్దులను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని.. మీరు తప్పు చేయకపోతే సీబీఐ విచారణ వేయమని కేంద్రాన్ని కోరాలని రాంబాబు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.

తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదని.. ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేశ్ బినామీలకు టెండర్లు ఇచ్చి రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అంబటి ఆరోపించారు.

ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలని.. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పూ చేసినట్లేనని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు డీజీపీపై హైకోర్టు వ్యాఖ్యలు దురదృష్టకరమని అంబటి ఆవేదన వ్యాఖ్యానించారు.

న్యాయస్థానాలపై తమకు గౌరవం వుందని.. హైకోర్టులో వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేమని, ఆర్డర్‌పై మాత్రమే సమాధానం చెప్పగలమని అంబటి పేర్కొన్నారు.