వీవీ ప్యాట్‌లను లెక్కించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో మాట్లాడారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన ఆయన..చంద్రబాబుకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని ఎద్దేవా చేశారు.

కొంతమంది ఆటగాళ్లు ఓడిపోయిన తర్వాత సెకండ్ ఇచ్చి వెళ్లరని, రిఫరీలు, అంపైర్లు, తోటి ఆటగాళ్లతోనూ తగాదా పెట్టుకుంటారని అంబటి వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యంలో తుంటరి ఆటగాడిలా వ్యవహరిస్తున్నారన్నారు.

5 వీవీప్యాట్లు లెక్కిస్తే సరిపోతుంది... దీనిని తిరిగి సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ బాబులో మార్పు రాలేదని రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించడాన్ని ఆయన స్వాగతించారు.

చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగాదా పెట్టుకుంటాడని.. అలాగే బాబు కూడా ఈవీఎం, వీవీప్యాట్, ఎన్నికల కమీషన్ బాలేదంటున్నారని రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటమిని ఎన్నికల కమీషన్ మీదా, ఈవీఎంల మీదా నెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.

కౌంటింగ్ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి ప్రయత్నిస్తారని వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రాంబాబు పిలుపునిచ్చారు. అర్థరాత్రి వరకు జరిగిన పోలింగ్ బాబుకు వ్యతిరేకంగా పడినదేనని రాంబాబు తెలిపారు.