అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పు.. అసెంబ్లీలో చర్చించేందుకు జగన్ సర్కార్ కసరత్తు

అమ‌రావ‌తిలోనే ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

ysrcp govt ready to discuss on ap high court verdict on amaravathi in assembly budget session

అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించనున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి (srikanth reddy) తెలిపారు. రాజధాని అంశాన్ని చర్చించే విషయమై బీఏసీలో నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజధాని మార్చడం, మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న దానిపై చర్చిస్తామని శ్రీకాంత్  రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ హక్కులపై చర్చించాలని శాసన సభ్యులు కోరుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ధర్మాన లేఖఫైన బీఏసీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం.. సభకు చట్టాలు చేసే హక్కు లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టం చేయడం శాసనసభకు సంక్రమించిన హక్కు అని ధర్మాన చెప్పారు. అసెంబ్లీ, న్యాయ, కార్యనిర్వహక బాధ్యతలపై చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన వెల్లడించారు. 

ఇకపోతే.. అమ‌రావ‌తిలోనే (amaravathi) ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు (ap high court) తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (botsa satyanarayana) . శ‌నివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. త‌మ ప్ర‌భుత్వ వైఖ‌రిని మరోమారు తేల్చిచెప్పారు. ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉందన్నారు. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో (ap three capitals) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్వేయ‌మ‌ని బొత్స పేర్కొన్నారు. 

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని ఎక్క‌డ నిర్మించాల‌నే విష‌యంపై కేంద్రం నియ‌మించిన జ‌స్టిస్ శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ (sivaramakrishnan committee) కూడా పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌ను ప్ర‌స్తావించింద‌ని మంత్రి గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ.. శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ సిఫారుల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ అధినేత ఆలోచ‌న‌లే త‌మ‌కు శిరోధార్యం అని చెప్పిన ఆయన.. టీడీపీ (tdp) నేత‌లు చెప్పిన మాట‌ల‌ను తాము పెద్ద‌గా ప‌ట్టించుకోబోమ‌ని తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అంశంపై కూడా ఆలోచిస్తున్నామని బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పునర్విభజనపై వినతులను కమిటీ పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. 

అంతకుముందు హైకోర్టు తీర్పుపై గురువారం స్పందించిన బొత్స సత్యనారాయణ కూడా పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. 

మూడు రాజధానులపై గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని.. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని బొత్స (botsa satyanarayana) స్పష్టంచేశారు. పరిపాలన వికేంద్రీకరణపై తాము అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ చట్టం అమల్లో ఉందని, అలాగే.. అమరావతి భూములను చంద్రబాబు హయాంలోనే హడ్కోకు తనఖా పెట్టారని.. ఇప్పుడేమీ కొత్తగా జరిగింది కాదని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్నవి అన్ని ఇస్తున్నాం కదా అని అన్నారు. అయితే తాజగా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించడం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios