అమరావతి: తనపై అనర్హత వేటు వేయించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు హైకోర్టును ఆశ్రయించారు.  

తనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అనర్హత వేటు వేయించాలని, సస్పెన్షన్ వేటు వేయించాలని తీసుకుంటున్న చర్యలను నిలుపదల చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. 

Also Read: రేపు ఢిల్లీకి వైసీపీ ఎంపీలు: రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ ఇచ్చే ఛాన్స్

తను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదని ఆయన అన్నారు.ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి ఉన్న దృష్ట్యా అత్యవసర కేసులను మాత్రమే  హైకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రఘురామకృష్ణమ రాజు పటిషన్ ను హైకోర్టు విచారించే అవకాశం ఉంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీల బృందం శుక్రవారం లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కోరనుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీలు స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేయనున్నారు. విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం మధ్యాహ్నం 3 గంటలకు ఓంబిర్లాను కలుస్తోంది. 

విజయసాయి రెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుకు రఘురామకృష్ణమ రాజు వివరణ ఇవ్వలేదు. పైగా, తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేశారు.