నరసరావుపేటలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు.. !!
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణల నేపథ్యంలో ఎప్పుడూ ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణల నేపథ్యంలో ఎప్పుడూ ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. వివరాలు.. రుణ మొత్తాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన వ్యాపారి గిరి ఇంటిని తెలుగుదేశం పార్టీ నేత చల్లా సుబ్బారావు ఆక్రమించినట్టుగా తెలుస్తోంది. అయితే గిరికి రుణాలు ఇచ్చిన ఇతర ఫైనాన్సర్లు వైసీపీ కార్యకర్తల మద్దతుతో అక్కడికి చేరుకుని తమ రుణాలు చెల్లించాలని కోరారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకోగా.. మరోవైపు నియోజకర్గ టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబు సంఘటనా స్థలానికి రావడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలోనే జరిగిన దాడుల్లో టీడీపీ నేతకు చెందిన ఒక కారు ధ్వంసం అయింది. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను బలవంతంగా చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన పోలీసులు ఘర్షణకు కారణమైన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, ఈ ఘటనపై గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చల్లా సుబ్బారావు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. చల్లా సుబ్బారావు ఇంటిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి.. ఇంట్లోని వారిపై దాడి చేసి బలవంతంగా బయటకు పంపించారని ఆరోపణు చేశారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.