కడప: వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె వైఎస్‌ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి పులివెందుల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్యపై లోతుగా విచారణ జరిపించాలని  ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. వైసీపీ తరపున ఆయన ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన తండ్రి ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని హత్య చేశారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. 

వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. 

నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే అంతకుముందు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన పీఏ కృష్ణారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

ఈ వార్తలు కూడా చదవండి

తలపై గొడ్డలితో నరికి చంపారు, డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం : సిట్ దర్యాప్తుపై జగన్ ఫైర్

మా కుటుంబంలో జరిగిన ప్రతీ హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉంది: వైఎస్ జగన్

చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి