కడప: తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి గొడ్డలితో ఐదు చోట్ల అతికిరాతకంగా నరికిచంపారని ఆరోపించారు. 

వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్త తెలిసిన తర్వాత కడప జిల్లా పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తన బాబాయ్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం హత్య జరిగిన తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  

తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను సహజమరణంగా చూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బాబాయ్ ను బాత్ రూమ్ వరకు ఎత్తుకెళ్లి అక్కడ రక్తం పూశారని ఆరోపించారు. బాత్ రూమ్ లో మూర్చవచ్చి పడిపోవడంతో తలకు దెబ్బతగిలి చనిపోయినట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

ఆ తర్వాత మళ్లీ ఎత్తుకుని బెడ్ రూంలో పడేశారని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు తన బాబాయ్ లేఖ రాశారని ఒక లేఖ కూడా తనకు చూపించారంటూ జగన్ స్పష్టం చేశారు. చనిపోతూ తన బాబాయ్ లేఖ రాస్తారా అంటూ ప్రశ్నించారు. చనిపోతూ తన బాబాయ్ లేఖ ఎలా రాస్తారు అంటూ నిలదీశారు. 

లేఖ రాస్తుంటే హంతకులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తన బాబాయ్ హత్యను డ్రైవర్ పై నెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. జిల్లా ఎస్పీని కేసుకు సంబంధించి వివరాలు అడుగుతుండగా అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు జిల్లా ఎస్పీకి అనేక సార్లు ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. వెంకటేశ్వరరావు ఫోన్లపై ఫోన్లు చెయ్యడం తాను చూసినట్లు తెలిపారు. 

పోలీసు వ్యవస్థ అంతా కేసును తప్పుదారి పట్టించేందుకు పనిచేస్తోందని ఆరోపించారు. హత్య చేయించిన వాళ్లే సిట్ దర్యాప్తు వేస్తే తమకు న్యాయం జరుగుతుందా అని జగన్ ప్రశ్నించారు. తమకు న్యాయం జరగాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాల్సిందేనని ,  సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. 

సీబీఐ దర్యాప్తుతోనే హంతకులు దొరుకుతారని అభిప్రాయపడ్డారు. హంతకులు ఎంతటి పెద్దవారైనా  సీబీఐ పట్టుకుంటోందని తెలిపారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే సిట్ కాకుండా థర్డ్ పార్టీ కావాలని డిమాండ్ చేశారు. వాళ్లే హత్య చేయిస్తారు వాళ్లే సిట్ వేస్తారు దీనిపై తమకు నమ్మకం లేదన్నారు.  

దొంగే దొంగ అన్నట్లు హత్య చేయించిన వాళ్లే సిట్ వేయిస్తే తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తమ కుటుంబంలో జరిగిన హత్యల వెనుక చంద్రబాబు ప్లాన్ ఉందని వైఎస్ జగన్ ఆరోపించారు. తన బాబాయ్ హత్యపై వైఎస్ఆర్ అభిమానులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఎలాంటి ఆందోళనలకు దిగకుండా శాంతియుతంగా ఉండాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మా కుటుంబంలో జరిగిన ప్రతీ హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉంది: వైఎస్ జగన్

చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి