కడప: ఇంట్లోకి చొరబడి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని కత్తులతో నరికి చంపేశారని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సుదీర్ఘరాజకీయ చరిత్రకలిగిన తన చిన్నాన్నను అత్యంత దారుణంగా కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపేశారంటూ ఆరోపించారు. 

తన చిన్నాన్న హత్యను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పుడు విధంగా దర్యాప్తు జరుపుతోందని ఆరోపించారు. తన చిన్నాన్న చనిపోతూ లేఖ రాశారని పోలీసులు తప్పుడు లేఖలు సృష్టించారని ఆరోపించారు. 

గతంలో తన తాతను చంపించారు. ఆ తర్వాత తన తండ్రిని చంపించారని జగన్ భావోద్వేగం వ్యక్తం చేశారు. ఇటీవలే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. 

తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనేనని ఆరోపించారు. తన కుటుంబంలో జరిగిన ప్రతీ హత్య వెనుక చంద్రబాబు పాత్ర క్లియర్ గా కనిపిస్తోందని జగన్ ఆరోపించారు. 

చంద్రబాబు ప్రభుత్వంలోనే తమ కుటుంబంపై హత్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తాత వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారని, అసెంబ్లీలో ఫినిష్ అయిపోతావ్ అని చెప్పిన తర్వాత తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని వైఎస్ మృతిపై ఇప్పటికీ తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. 

ప్రస్తుతం తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరిగిందని స్పష్టం చేశారు. తమ కుటుంబంపై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టిందని తమ కుటుంబాన్ని రాజకీయంగా అంతమెుందించేందుకు కుట్ర పన్నుతోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 

తన బాబాయ్ హత్యపై వైసీపీ శ్రేణులు ఎలాంటి నిరసనలు చేపట్టొద్దని అంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. తమకు దేవుడుపై నమ్మకం ఉందని తన బాబాయ్ ను హత్య చేసిన వారిని శిక్షిస్తాడని జగన్ తెలిపారు.