మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీసీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీసీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుందరీష్‌ల ధర్మాసనం.. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ జరిపింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని అవినాష్ రెడ్డితో పాటు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. 

అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. గత నెల 31న ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత తన పిటిషన్‌లో కోరారు. సీబీఐ పేర్కొన్నట్లుగా కేసులో అవినాష్ రెడ్డిది కీలకమైన ప్రమేయం ఉందని ఆరోపించారు. అవినాష్ రెడ్డిపై సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్లు, అఫిడవిట్లన్నీ తీవ్ర స్వభావాన్ని కలిగి ఉన్నాయని.. అయితే వాటిని తెలంగాణ కోర్టు పట్టించుకోలేదని అన్నారు. వివేకా హత్య కేసు విచారణను జూన్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన నేపథ్యంలో విచారణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతున్నట్టుగా చెప్పారు.