Asianet News TeluguAsianet News Telugu

ఆ సమయంలో వైఎస్ భారతి ఆందోళనగా కనిపించింది, ఉదయ్ తల్లి మాటతోనే అనుమానం: సీబీఐకి సునీతా రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.

YS Viveka Murder Case Sunitha Reddy tell key finding to cbi ksm
Author
First Published Jul 22, 2023, 3:15 PM IST

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. తాజాగా సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన  వాంగ్మూలంలోని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 మార్చి 22 వైఎస్ భారతి పోన్ చేసి.. ఇంటికొచ్చి కలుస్తానని చెప్పారని సునీత పేర్కొన్నారు. తాను  కడప, సైబరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పినట్టుగా తెలిపారు. అయితే ఎక్కువ సమయం తీసుకోనంటూ భారతి వెంటనే ఇంటికి వచ్చేశారని చెప్పారు. అయితే భారతితో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో ఆశ్చరపోయానని వెల్లడించారు. తాను లిఫ్టు వద్దే నిలబడి వైఎస్ భారతితో మాటాడినట్టుగా చెప్పారు. ఆ సమయంలో వైఎస్ భారతి ఆందోళనగా కనిపించారని తెలిపారు. తన తండ్రి మరణం తర్వాత తొలిసారి ఇంటికొచ్చినందుకు బాధగా  ఉన్నారని అనుకున్నట్టుగా చెప్పారు. 

‘‘ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్‌లో ఉండాలని భారతి నాకు చెప్పారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడాలని సజ్జల రామకృష్ణారెడ్డి  నాకు  చెప్పారు. సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించాను. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియో పంపించాను. వీడియో కాదు.. అంశానికి ముగింపు పలికేలా ప్రెస్‌మీట్ పెట్టాలని సజ్జల చెప్పారు. జగన్ పేరుతో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని  సజ్జల సలహా ఇచ్చారు. అయితే నేను అప్పటివరకు అవినాష్ పేరు ఎక్కడా  ప్రస్తావించలేదు. అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించాను. అవినాష్ రెడ్డి అభ్యర్థితత్వాన్ని నా తండ్రి  కోరుకోలేదని నాకు తెలుసు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు  ఉన్నాయి.

సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టాను. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదటి నుంచి అడుగుతున్నాను. అయితే పొరపాటు జరిగిందని తెలుసు..  క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా  కష్టపడ్డారు. ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని  ఆలోచించాను’’ అని సునీతా రెడ్డి పేర్కొన్నారు. 

‘‘మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారు. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నాకులపై ఆరోపణలు ఉన్నాయి. వివేకానందరెడ్డి ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ నాకు చెప్పారు. అది మనసులో పెట్టుకుని టీడీపీ  నేతలు ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ అన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదు’’ అని సునీతా రెడ్డి సీబీఐకి చెప్పారు. 

2019 జూలైలో అవినాష్‌పై తనకు అనుమానం మొదలైందని సునీతా రెడ్డి వెల్లడించారు. ‘‘తన కుమారుడికి ముందే తెలుసునని  గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారు. మృతి విషయం బయటకు రాకముందే తన కుమారుడికి తెలుసునని ఆమె చెప్పారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు ఉదయ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో అనుమానం వచ్చింది’’ అని సునీతా  రెడ్డి పేర్కొన్నారు. ఇక, భారతి, సజ్జల వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌లను కూడా సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios