కడప: మాజీమంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం ఉన్నా ఎన్ కౌంటర్ చేసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు. 

వైయస్ వివేకాందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. సిట్ బృందం ఇచ్చిన నోటీసులో భాగంగానే తాను విచారణకు హాజరైనట్లు తెలిపారు.

వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమంటూ స్పష్టం చేశారు. వైయస్ వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్నవారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే వైయస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్యపై ఆనాడు జగన్ సీబీఐ విచారణ కోరిన సంగతిని గుర్తు చేశారు. 

వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ విచారణకు మాజీమంత్రి డుమ్మా...

తెలుగుదేశం ప్రభుత్వంలో సీబీఐ విచారణ కోరిన వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఎందుకు వేసినట్లు అని ప్రశ్నించారు. తనతోపాటు అన్ని పార్టీలు వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని అసలు నిందితులను బట్టబయలు చేయాల్సిందేనని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. 

ఇకపోతే ఈ ఏడాది ఎన్నికలకు ముందు మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి తన నివాసంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ బృందం 1300 మందిని విచారించింది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, పనిమనిషిని కూడా విచారించింది. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న వ్యక్తి సైతం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఇకపోతే ఈకేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురిని నార్కో ఎనాలిసిస్ పరీక్షల నిమిత్తం పూణెకు సైతం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు త్వరలోనే ముగింపు పలకాలనే ఉద్దేశంతో సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసింది. 

వైఎస్ వివేకా హత్య కేసు: ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...