కడప:  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ నెల 6నే విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా జమ్మలమడుగు డీఎస్పీ తనను కోరారని, డిసెంబరు 6న తాను ఢిల్లీలో ఉండటం వల్ల హాజరుకాలేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇచ్చారని, తనకు మాత్రమే 161 సీఆర్సీ కింద నోటీసులు ఇచ్చారని, అది సరైంది కాదని ఆయన అన్నారు.

తానును అజ్ఞాతంలో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మీడియా అజ్ఞానాన్ని విడనాడాలని, వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని ఆయన చెప్పారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో వారి అంతరాత్మకే తెలుసునని వ్యాఖ్యానించారు.

నేడు లేదా రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ కోరిందని ఆయన చెప్పారు. టీడీపీ హయాంలో సిట్ వద్దు సీబీఐ కావాలని అడిగిన వారు నేడు సిట్ కావాలని అడగటం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సిట్ పైన ఎవరికీ అవగాహన లేదని ఆయన చెప్పారు. 

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో ఒక్క శాతం ప్రమేయం ఉందని రుజువైనా  పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని ఆయన చెప్పారు. తనపై వేధింపులు మంచిది కాదని, వైఎస్ కుటుంబం తనపై కక్ష కట్టిందని ఆయన అన్నారు. జాగ్రత్తగా ఉండాలని చాలా మంది తనతో చెప్పారని ఆయన అన్నారు. 

తనది తప్పుంటే ఎన్ కౌంటర్ చేసుకోవచ్చునని, తాను కనిపించకుండా దాక్కోవడానికి చీమను కానని, తాను మనిషినే అని ఆయన అన్నారు. ఇష్టం వచ్చినట్లు తనపై టీవీల్లో కథనాలు ప్రసారం చేయడం తగదని అన్నారు. ప్రసారమైన తప్పుడు కథనాలతో తన కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారని ఆయన అన్నారు.