వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు సీబీఐ గురువారం కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయంపై పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు సీబీఐ గురువారం కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఉదయ్ కుమార్ రెడ్డి డైరీని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. అన్ని ఆధారాలు సేకరించాకే ఉదయ్‌ను అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది. హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఉదయ్, అవినాష్‌లు ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయంపై పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది.
Also Read: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి
కాగా.. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ 6గా వున్న ఉదయ్ కుమార్ రెడ్డికి ఎట్టిపరిస్ధితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఈ కేసులో ఉదయ్ కుమార్‌ను ఏప్రిల్ 14న అరెస్ట్ చేసింది సీబీఐ. తన కస్టడీ గడువు ముగిసినందున బెయిల్ ఇవ్వాలని ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్ట్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో వున్నందున బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. అలాగే వివేకా హత్య కేసు డైరీని సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
