ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం ఆమె ఉద్దండరాయుని పాలెం పర్యటనకు వెళ్లాలనే ఉద్దేశంతో సన్నద్ధమవుతుండగా, విజయవాడలోని ఆమె నివాసం వద్ద పోలీసులు మోహరించి ఆమెను బయటికి రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన నేపథ్యంలో, అదే ప్రాంతాన్ని సందర్శించాలన్న షర్మిల నిర్ణయాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల ను ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు స్పష్టమైన ఆంక్షలు విధించారు.
ఈ చర్యలపై వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? నా ఇంట్లో నన్ను హౌస్ అరెస్ట్ చేయడమేంటి?” అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అరెస్టు వెనుక ఉన్న కారణాలను ఏపీ ప్రజలకు తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు.
వైఎస్ షర్మిల చేసిన ట్వీట్
అంతేగాక, “నా స్వంత పని మీద పీసీసీ కార్యాలయానికి వెళుతున్న నన్ను అడ్డుకోవడం నేరం కాదా?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎలాగైనా ఉద్దండరాయునిపాలెం పర్యటనకు వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేశారు.


