ఏపీ ప్రజలకు ఊరట: ఓలా సర్వీసులకు ప్రభుత్వం అనుమతి.. కండిషన్స్ అప్లై
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉన్న చోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కష్టమైనా, నష్టమైనా భరిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర సేవలకు సంబంధించి ప్రజలు వినియోగించుకునేందుకు గాను ఓలా క్యాబ్‌కు అనుమతించింది.
Also Read:కేంద్రం నుండి నాలుగువేల మాస్కులు...మూడువేలు వైసిపి వారికే: వంగలపూడి అనిత
కేవలం అత్యవసర వైద్య సేవలకు మాత్రమే వీటిని అనుమతిస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర వైద్య, రవాణా సేవలు అందించేందుకు ఓలా సంస్థ ముందుకొచ్చిందని.. ఇందుకు సంబంధించి రవాణా, పోలీస్ శాఖలు చర్చించి నిర్ణయం తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
డయాలసిస్, క్యాన్సర్, గుండెజబ్బు, తదితర రోగులు ఓలా సేవలను పొందవచ్చని కృష్ణబాబు చెప్పారు. కరోనా లక్షణాలు లేని రోగులకే ఓలా క్యాబ్స్‌లో రవాణాకు అనుమతిస్తారని... రోగులు వారి ఇంటి నుంచి ఆసుపత్రికి రాకపోకలకే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.
Also Read:గుడ్లు, అరటి పండ్లు, జ్యూస్, డ్రై ఫ్రూట్స్: ఏపీ క్వారంటైన్ మెనూ ఇదే
ప్రస్తుతం కర్ణాటక వైద్య శాఖతో ఓలా క్యాబ్స్ ఈ తరహా సేవలు అందిస్తోందని కృష్ణబాబు వెల్లడించారు. కాగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 217 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అన్ని కేసులు నెగిటివ్‌గా వచ్చాయని ప్రభుత్వం తెలిపింది.