కేంద్రం నుండి నాలుగువేల మాస్కులు...మూడువేలు వైసిపి వారికే: వంగలపూడి అనిత
కరోనా మహమ్మారిని అరికట్టడంలో వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.
గుంటూరు: ఏపిలో అసలు ప్రజాస్వామ్య పాలన వుందా లేక నిరంకుశ పాలన ఉందో అర్ధం కావడం లేదని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. తమకు ప్రాణభయం ఉందని చెప్పిన వ్యక్తిని ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? అని ప్రశ్నించారు. జరుగుతున్న విషయన్ని చెప్పినందుకు 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని తొలగించడం ఎంత వరకు సమంజసం? అంటే ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.
''కనీసం కమిటీ కూడా వేయకుండా ఒక దళిత డాక్టర్ ను తొలగించడం సిగ్గుచేటు. అగ్రకుల అహంకారంతో దళితులకు అన్యాయం చేస్తున్నారు. ఒక డాక్టర్ ను సస్పెండ్ చేసి 10వేల మంది డాక్టర్లకు ఏం సందేశం పంపుతున్నారు? డాక్టర్లకు సరైన సౌకర్యాలు కల్పించక పోయినా ప్రశ్నించకూడదా? ఎంతో మంది డాక్టర్లు తమ కుటుంబాలను సైతం వదిలి పెట్టి సైనికుల్లా పని చేస్తుంటే కనిపించడం లేదా?'' అని మండిపడ్డారు.
''డాక్టర్ కు సస్పెన్షన్ ఆర్డర్ ను ఆంబులెన్స్ లో పంపించడం అంటే ఇంత కంటే దిక్కుమాలిన పాలన మరొకటి ఉండదనేది స్పష్టం అవుతుంది. కేంద్రం నుంచి 4వేల మాస్కులు వస్తే 3వేల మాస్కులు వీఐపీలకే వెళ్లిపోయాయట. నాయకులేమైనా కరోనా రోగులకు పరీక్షలు చేస్తున్నారా? ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్లేమో ఎన్-95 మాస్కులు వేసుకొని ఇంట్లో కూర్చున్నారు'' అని మండిపడ్డారు.
''అమెరికా లాంటి దేశాలు మృత్యుఘోష వినిపిస్తున్నాయి.మోడీ లాంటి వ్యక్తి నర్సులకు పాదాభివందనం చేస్తుంటే జగన్ మాత్రం డాక్టర్లను తొలగిస్తున్నారు. అధికారపక్షం నుంచి జగన్ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ని సార్లు ప్రజలకు సూచనలు ఇచ్చారో బహిరంగ చర్చకు సిద్దమా'' అని సవాల్ విసిరారు.
''చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సీఎంలు సామాజిక దూరం పాటించి పని చేస్తున్నారు. జగనేమో ఇంటి నుంచి భయటకు రావడం లేదు. కరోనా ఎక్కడ పుట్టిందో ముఖ్యమంత్రికి తెలియపోవడం దౌర్బాగ్యం. చంద్రబాబు నాయుడు విజన్ పని చేస్తుందనడానికి మెడ్ టెక్ జోన్ ఉదాహరణగా చెప్పొచ్చు. దీని మీద కూడా గతంలో వైకాపా నాయకులు కారు కూతలు కూశారు. ఇప్పుడు అదే మెడ్ టెక్ జోన్ కూడా జగన్ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సొమ్మొకడది సోకొకడిది అన్నట్లుగా ఉంది. అవసరమైతే మెడ్ టెక్ జోన్ కూడా వైకాపా రంగులు వేస్తారేమో?'' అంటూ సెటైర్లు విసిరారు.
''ఇప్పటికే మాస్కులు, శానిటైజర్లకు వైకాపా రంగులు వేసుకుంటున్నారు. పారాసిట్మాల్ వేస్తే కరోనా పోతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం సిగ్గుచేటు. వాలెంటరీ వ్యవస్థ పనికి రానిదిగా ఉంది. కేరళలో వాలెంటరీ వ్యవస్థ సృష్టించుకొని పని చేస్తున్నారు. కాని ఇక్కడ ఉన్న వ్యవస్థను వాడుకోలేకపోతున్నారు. బియ్యం, పప్పు తీసుకోవడానికి ముసలి వాళ్లు క్యూలో నిలబడి తీసుకోవాలా? కేంద్రం ఇస్తున్న రూ.1000 వాలెంటరీలు ఇంటికి వెళ్లి ఇస్తున్నారు. అంటే దోచుకోవడానికి అవకాశం ఉన్న వాటినే వైకాపా నాయకులు పంచుతారా?'' అని మండిపడ్డారు.
''స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్ధులు దగ్గరుండి మరీ పంచటం సిగ్గుచేటు. కరోనా సందర్బంలోను అవినీతి రాజకీయాలు చేయడమేంటి. ఇటువంటి సమయంలోను ఇసుక, ఛీప్ లిక్కర్ ను అక్రమంగా అమ్ముకుంటున్న ఘనత వైకాపా నాయకులకే దక్కుతుంది. ఇంత మంది డాక్టర్లు, వాలెంటరీలు ఉంటే కరోనా వైరస్ ఎందుకు వ్యాప్తి చెందుతుంది?'' అని అడిగారు.
''జగన్ ఒక సైకో.. రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టడం దానికి అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు సూచనలు తీసుకునే పెద్ద మనసు కూడా జగన్ కు లేదు. జగన్ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంటే ఏనాడైనా సలహాలు ఇచ్చారా? హుద్ హుద్ తుఫాన్, తిత్లి తుఫాన్ సమయంలో దగ్గరుండి కూడా రాలేదు. ఫణి వంటి తుఫాన్ సమయంలో ముఖ్యమంత్రి సినిమాలు షికార్లకు తిరిగారు. వైకాపా నాయకులకు దమ్ముంటే ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలో ఆలోచన చేయాలి. 20 రోజులకే సగం జీతాలు అంటున్నారు. ఇదే పరిస్థితి రెండు నెలలు కొనసాగితే జీతాలు ప్రశ్నార్ధకమే. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ దేవుడే రక్షించాలి'' అంటూ వైసిపి ప్రభుత్వాన్ని వంగలపూడి అనిత విమర్శించారు.