ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి ఆయన ఈ పర్యటనకు ప్లాన్ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి ఆయన ఈ పర్యటనకు ప్లాన్ చేశారు. ఈ నెల 21న సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో ఉండనున్నారు. అయితే పూర్తిగా పర్సనల్ టూర్ అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతీ రెడ్డి, వారి కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలు ఈ పర్యటనలో ఉండనున్నారు. అయితే సీఎం జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సీఎం జగన్ ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలో అధికారం నిలుపుకునే విధంగా పార్టీ నేతలతో కీలక సమీక్షలు నిర్వహిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై మరోసారి సమీక్ష చేపట్టిన సీఎం జగన్.. విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్నందున.. ప్రజల్లో ఎక్కువ సమయం ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.