తిరుమల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థంలో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. 

రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించి ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చిన జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. 

రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేయనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్ విమానాశ్రయం నుంచి తిరుమల చేరుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని వైయస్ జగన్ దర్శించనున్నారు.

తిరుమలలో పద్మావతి అతిథిగృహంలో బస చేయనున్నారు జగన్. వైయస్ జగన్ వెంట జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు  రోజా,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ఉన్నారు.  

ఇకపోతే చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 14 అసెంబ్లీ స్థానాలకు గానూ కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు తిరుమల చేరుకున్నారు.