సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించారు : వైఎస్ జగన్

YS Jagan tweet on Nayee Brahmin Community
Highlights

టిటిడి తో పాటు ప్రతి దేవాలయ బోర్డులోనూ...

నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే సీఎం చంద్రబాబు వారిని బెదిరించడం ఏంటని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న సీఎంచంద్రబాబు నాయీ బ్రాహ్మణులను బెదిరించడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ట్విట్టర్ ద్వారా నాయీ బ్రాహ్మణులకు అండగా నిలబడ్డాడు.ఈ  సమాజాన్ని నాగరికంగా తీర్చిదిద్దడంలో తోడ్పాటునందిస్తున్న వారినే చంద్రబాబు సచివాలయం సాక్షిగా బెదిరించాడని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని జగన్ అన్నారు. వారి సమస్యలపై  తమ ప్రభుత్వం ఏర్పడగానే దృష్టి సారిస్తానని అన్నారు.  

జగన్ తన ట్వీట్ లో ఇలా రాశారు. ''మనం నాగరికంగా ఉండాలంటే నాయీ బ్రాహ్మణుల సేవలు పొందడం అవసరం. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను.తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గమనార్హం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25 చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు గారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్టు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపట ప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీబ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీబ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడం చట్టానికి వ్యతిరేకం. దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతి దేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం'' అని జగన్ ట్వీట్ చేశారు. 

 

loader