అమరావతి: డిప్యూటేషన్ పై ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తమ రాష్ట్రానికి తెచ్చుకునే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టు వీడడం లేదు. తెలంగాణ క్యాడర్ కు చెందిన స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవడానికి ఆయన మరోసారి ప్రయత్నం చేశారు. స్టీఫెన్ రవీంద్రను రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ గా నియమించాలనేది జగన్ ఉద్దేశ్యం. 

స్టీఫెన్ రవీంద్రను ఎపీకి పంపించాలని వైఎస్ జగన్ నిరుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను స్వయంగా కోరారు. ఈ విషయంపై రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించలేదు, అలాగని ఆమోదించలేదు. 

1999 ఐపిఎస్ అధికారి అయిన  స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వెస్ట్ జోన్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు జగన్ స్టీఫెన్ రవీంద్ర విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి అమిత్ షాతో కూడా ఆ విషయం చెప్పినట్లు సమాచారం. 

తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందని, అందువల్ల స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపించాలని ఆయన పదే పదే కోరినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై మోడీ గానీ అమిత్ షా గానీ ఏమైనా హామీ ఇచ్చారా అనే విషయం తెలియదు. ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా మనీష్ కుమార్ సిన్హా పనిచేస్తున్నారు. 

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీఫెన్ రవీంద్ర విషయాన్ని జగన్ కదిలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపిస్తే అభ్యంతరం లేదని చెప్పింది. దాంతో స్టీఫెన్ రవీంద్రను ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ జగన్ ప్రభుత్వం నిరుడు జూన్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపించింది. అయితే, అప్పటి నుంచి దానిపై కదలిక లేదు. 

స్టీఫెన్ రవీంద్ర నెల పాటు సెలవు పెట్టి విజయవాడలో ఉండి కేంద్రం అనుమతి కోసం వేచి చూశారు కూడా. ఆ తర్వాత కూడా ఆయన సెలవును పొడిగించుకుంటూ వచ్చారు. దాదాపు 45 రోజుల పాటు ఆయన సెలవులో ఉండి కేంద్ర అనుమతి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. చివరకు వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు జగన్ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందా, లేదా అనే విషయంపై వేచి చూడాల్సిందే.