ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వివరాలు.. సీఎం జగన్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. సీఎం జగన్‌తో పాటు సీఎస్ జవహర్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నట్టుగాతెలుస్తోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.03 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో కాసేపటికే సాంకేతిక లోపం ఉన్నట్టుగా పైలట్ గుర్తించారు. తర్వాత వెంటనే గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సాయంత్రం 5.26 గంటలకు సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం గన్నవరం ఎయిర్‌పోర్టులో క్షేమంగా ల్యాండ్ అయింది.

ఆ తర్వాత కొంతసేపు ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో వెయిట్ చేసిన సీఎం జగన్.. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరారు. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు సాంకేతిక లోపానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సీఎం జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 6:45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రికి ఆయన 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలు, ఇతర విదేశీ ప్రముఖులతో కలిసి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహాక రౌండ్ టేబుల్ సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారు. ఆ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోవాల్సి ఉంది.