నెల్లూరు జిల్లాలో నుండి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయానికి జగన్ ప్రకాశం జిల్లాలోకి వెళ్ళాలి. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేట్లుగా పార్టీ రూట్ మ్యాప్ ను సిద్దం చేసింది. 22 రోజుల పాటు సుమారు 255 కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ పాల్గొంటారు. కొన్ని చోట్ల బహిరంగసభలు, మహిళలు, వృత్తి నిపుణులతో ముఖాముఖితో పాటు సదస్సులు జరుగుతాయి. గురువారంతో జగన్ 1195 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు. రాయలసీమలోని పలు నియోజకవర్గాలను ప్రజా సంకల్పయాత్రలో జగన్ కవర్ చేశారు. మొత్తం రాయాలసీమంతా ప్రజల నుండి జగన్ కు అనూహ్య స్పందన కనబడింది.

రేపటి నుండి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు మాజీ మంత్రి వైసిపి ప్రముఖ నేతల్లో ఒకరైన బాలిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జగన్ 9 నియోజకవర్గాలను టచ్ చేశారు. 142 గ్రామాలు, 14 మండలాల్లో పర్యటించారు. 20 రోజుల పాదయాత్రలో జగన్ 267 కిలోమీటర్లు కవర్ చేశారు. పాదయాత్ర ప్రారంభించి శుక్రవారానికి 88 రోజులు పూర్తవుతుంది. ఈ జిల్లాలోకి అడుగుపెట్టడం ద్వారా జగన్ కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించినట్లైంది.