ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ మే 23న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దానికి శుక్రవారం రోజున అంటే దాదాపు వారం తరువాత జగన్ థాంక్స్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. 

అయితే ఈ ఆలస్యం కావాలని చేసినది కాదు.. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించడంతో ఆయన నివాసానికి రాకపోకలు పెరిగాయి. ఆ వెంటనే జగన్ .. హైదరాబాద్‌లో గవర్నర్, కేసీఆర్‌‌లను కలిసేందుకు వెళ్లారు. 

ఆ తర్వాతి రోజు ఢిల్లీలో ప్రధాని మోడీ, అమిత్ షా, ఏపీ భవన్‌లో ప్రెస్ ‌మీట్‌లో పాల్గొన్నారు. ఇక అక్కడి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనం, కడపలో పెద దర్గా, పులివెందుల చర్చిలో ప్రార్ధనలు నిర్వహించి.. ఇడుపులపాయలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించారు. 

మళ్లీ బెజవాడలో కనక దుర్గమ్మ దర్శనం.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక మే 30న ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గెలిచిన నాటి నుంచి ప్రమాణ స్వీకారం వరకు క్షణం తీరిక లేకుండా గడిపిన జగన్‌కు కాస్త ఖాళీ దొరకడంతో జగన్ ‌సోషల్ మీడియా వైపు తొంగి చూశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చారు.