గుంటూరు: ఇంకా అనారోగ్యంతో బాధపడుతుండగానే ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని వైసిపి ప్రభుత్వం డిశ్చార్జ్ చేయించిందని టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సాయంత్రం 5గంటల తర్వాత అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఆసుపత్రులను కూడా వైసిపి ప్రభుత్వం మేనేజి చేయడం గర్హనీయమని... వైద్యులపై ఒత్తిళ్లు తెచ్చి బలవంతంగా డిశ్చార్జ్ చేయించారన్నారు. ఇలా అచ్చెన్నాయుడిని జైలుకు పంపడం దుర్మార్గ చర్యగా యనమల పేర్కొన్నారు. 

''ఎర్రన్నాయుడి కుటుంబంపై జగన్ పగబట్టారు. తనను జైలుకు పంపారనే అక్కసుతో ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నారు. తాను 16నెలలు జైలుకెళ్లాను కాబట్టి  అందరినీ జైలుకు పంపాలనే ప్రతీకారేచ్ఛతో జగన్ వ్యవహరిస్తున్నారు'' అని అన్నారు.  

read more   జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. సబ్‌జైలుకు తరలింపు, 3న బెయిల్‌పై తీర్పు

''సాక్ష్యాధారాలతో సహా అంబులెన్స్ ల కుంభకోణాన్ని టిడిపి బైటపెట్టింది. కానీ ఈ అంబులెన్స్ ల అవినీతిలో నిందితులపై చర్యలు లేవు, కనీసం విచారణ చేయలేదు. సరస్వతీ పవర్ కు నీళ్లు, గనుల కేటాయింపులో అక్రమాలను బైటపెట్టాం. దీనిపైనా కనీసం విచారణ జరపలేదు. బీసి కాబట్టే అచ్చెన్నాయుడిపై కక్ష సాధిస్తున్నారు. అదే అంబులెన్స్ ల అవినీతి నిందితులను ఎందుకని అరెస్ట్ చేయలేదు..?'' అని యనమల ప్రశ్నించారు. 

''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి బురదలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ బురదను టిడిపికి అంటించాలని చూస్తోంది. అందులో భాగంగానే టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేస్తుంది'' అని యనమల తెలిపారు.