ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ సీనియర్, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను నేరుగా సబ్‌జైలుకు తరలించారు.

భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్సులో అచ్చెన్నాయుడిని జైలుకు తీసుకెళ్లారు. అయితే కోవిడ్ టెస్ట్ చేశాక, నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారితే...రేపు చంద్రబాబు, లోకేష్ జైలుకే: జోగి రమేష్

మరోవైపు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదని అచ్చెన్న తరుపు న్యాయవాది వాదించారు. కోర్టులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతారని చెప్పారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 3న న్యాయస్థానం తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది. కాగా.. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:చంద్రబాబు విలవిల: కేసుల చిక్కుల్లో కొమ్ములు తిరిగిన నేతలు

అప్పటికే పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉండటంతో ఆరోగ్య కారణాల రీత్యా అచ్చెన్నాయుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచడంతో న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

అయితే అనారోగ్యం కారణంగా అప్పటి నుంచి జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోనే ఆయనను విచారించింది ఏసీబీ. ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడంతో సబ్ జైలుకు తరలించారు.