Asianet News TeluguAsianet News Telugu

తీర్పులు అనుకూలంగా రాకుంటే న్యాయమూర్తులపై ట్రోలింగ్.. వారంతా అసాంఘీక శక్తులే: సీఎం జగన్

పోలీసు ఉద్యోగం ఒక బాధ్యత అని.. సవాలుతో కూడుకున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సమాజం కోసం ప్రాణాలను బలిపెట్టడానికి సిద్ధపడిన యోధులు పోలీసులని పేర్కొన్నారు.

YS Jagan Speech at Police Commemoration Day 2023 in Vijayawada ksm
Author
First Published Oct 21, 2023, 9:48 AM IST

పోలీసు ఉద్యోగం ఒక బాధ్యత అని.. సవాలుతో కూడుకున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సమాజం కోసం ప్రాణాలను బలిపెట్టడానికి సిద్ధపడిన యోధులు పోలీసులని పేర్కొన్నారు. నేరాలు చేస్తున్నవారిని ఎదుర్కొవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని సీఎం జగన్‌ ప్రసంగించారు.  విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్‌ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని  అన్నారు. 

పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా పోలీసులు అప్‌డేట్ కావాలని సూచించారు. అంగళ్లు, పుంగనూరులలో ప్రతిపక్ష నేత వారి పార్టీ నేతలను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేయించారని విమర్శించారు. ఈ ఘటనలో పుంగనూరు ఘటనలో ఒక పోలీసు కన్నుపోయిందని.. 40 మంది గాయపడ్డారని అని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులుపై దాడి చేయడం చాలా బాధకరమని పేర్కొన్నారు. దుష్ట శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సూచించారు. 

ప్రభుత్వంపై, సమాజంపై దాడులు చేసి మనుగడ సాగించాలనుకునే శక్తులు.. అడవుల్లో, అజ్ఞాతంలో కాకుండా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజాజీవితంపై దాడులు చేయడం ఈ మధ్య కాలంలో చూస్తునే ఉన్నామని అన్నారు. అవినీతి, నేరాలు చేసి ఆధారాలతో సహా దొరికిపోయినా.. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయమూర్తులపై కూడా ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి పనులు జాస్వామ్యంపై నమ్మకం లేని అసాంఘీక శక్తులు చేసే పనులేనని అన్నారు.  ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజా జీవితాన్ని స్వార్దం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘీక శక్తులేనని అన్నారు. 

ఏపీలో పోలీస్‌ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జగన్ చెప్పారు. పోలీసుల వైద్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య భద్రత కల్పిస్తోందని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోందని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios