వైసిపి అధ్యక్షు జగన్మోహన్ రెడ్డి మాట తప్పలేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలను అనర్హులుగా ప్రకటించేవరకూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదంటూ తెగేసి చెప్పారు. మార్చి 5వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైసిపిని ఆహ్వానించారు. పనిలో పనిగా పలువురు వైసిపి ఎంఎల్ఏలతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు.

దర్శి నియోజకవర్గంలోని తాళ్ళూరులో శనివారం పార్టీకి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సమావేశమయ్యారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయటం, మార్చి 5 నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అదే సందర్భంగా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు అసెంబ్లీ సమావేశాల ప్రస్తావన తెచ్చారు.

జగన్ మాట్లాడుతూ, ఫిరాయింపులపై చర్యలు తీసుకునే వరకూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేశారు.  అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అదే మాటమీద నిలబడున్నట్లు ఈరోజు స్పష్టం చేశారు. వైసిపి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలంటే ముందుగా ఫిరాయింపులపై వేటు పడాల్సిందేనంటూ జగన్ గట్టిగా చెప్పారు.