వైసిపి ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేస్తున్న ఆఫర్లన్నీ తనకు తెలుసని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాళ్ళూరులో శనివారం పార్టీ ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సమావేశమయ్యారు. రాజ్యసభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పరిచయం చేశారు.

ఆ సందర్భంగా మాట్లాడుతూ, వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలను టిడిపి ప్రలోభాలకు గురిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎవరెవరికి ఎంతెంత ఆఫర్లు వచ్చాయన్న విషయం తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఇపుడు కూడా టిడిపి చేస్తున్న ప్రయత్నాలపై తనకు సమాచారం ఉందన్నారు.

టిడిపి ఎంత ఒత్తిడి తెస్తున్నా, ఎన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నా లొంగని 44 మంది ఎంఎల్ఏలను అభినందించారు. వేమిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఫిరాయింపులపై వేటు వేసేంత వరకూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. అయితే, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మాత్రం ఒక్కరోజు శాసనసభకు వెళ్ళక తప్పదని జగన్ తేల్చేశారు.