ఇచ్ఛాపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబు జాతీయ రాజకీయాల పేరుతో దేశాలు తిరుగుతున్నాడే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. 

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రత్యేక విమానాల్లో దేశాలు పట్టి తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. జాతీయ రాజకీయాల పేరుతో బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం కుమార స్వామితో కలిసి టీ తాగుతాడు. కానీ కరువుతో విలవిలలాడుతున్న అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు మాత్రం సమయం దొరకదని విమర్శించారు. 

మళ్లీ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి సాంబారు ఇడ్లీ తింటాడని కానీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిత్తూరు జిల్లాను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అక్కడితో సరిపెట్టకుండా ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్లి అక్కడ సీఎం మమతా బెనర్జీని కలిసి చికెన్ తింటాడు అని విరుచుకుపడ్డారు జగన్. 

చంద్రబాబు చేస్తున్న మోసాలను రైతులు, యువత అంతా గుర్తించారని ఇక చంద్రబాబు ఆటలు సాగవన్నారు. అందుకే రైతులు కానీ యువత కానీ అంతా కలిసి నిన్ను నమ్మం బాబూ అంటూ తెగేసి చెప్తున్నారని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. 

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే....ప్రకృతి విపత్తులతో రాష్ట్రంలోని రైతన్న విలవిలలాడుతుంటే చంద్రబాబు పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు ఆడుతాడంటూ జగన్ మండిపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్