Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

 శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. అశేష జనవాహిని సమక్షంలో జగన్ తన పాదయాత్రను ముగించారు.  

ys jagan inaugurates vijaya sankalpa sthoopam ichapuram
Author
Srikakulam, First Published Jan 9, 2019, 3:43 PM IST

ఇచ్ఛాపురం:  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. అశేష జనవాహిని సమక్షంలో జగన్ తన పాదయాత్రను ముగించారు.  

కడప జిల్లా ఇడుపుల పాయలో గత ఏడాది నవంబర్ 6న ప్రారంభమైన పాదయాత్ర 341 రోజుల పాటు అప్రతిహాతంగా కొనసాగింది. జనవరి 9 బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోకవర్గంలో పాదయాత్ర ముగిసింది. అందులో భాగంగా బాహుదా నదీ తీరంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప స్థూపాన్ని వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. 

ఈ పైలాన్ ఆవిష్కరణకు వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. పాదయాత్రలో భాగంగా స్థూపం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ ను సర్వమత పెద్దలు ఆశీర్వదించారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్‌ జగన్‌ పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. 

ఇకపోతే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో గుర్తుండిపోయేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పైలాన్ ను ఏర్పాటు చేసంది. భావితరాలకు వైఎస్ జగన్ పాదయాత్ర గుర్తుండిపోయేలా ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ పైలాన్ ఇచ్చాపురం నియోజకవర్గానికే తలమానికంగా రూపొందించారు వైసీపీ నేతలు. 

వైసీపీ రూపొందించిన ఈ విజయ సంకల్ప స్థూపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. విజయ సంకల్ప స్థూపం చుట్టూ ఉన్నమూడు వైపుల ఉన్న ప్రాంగణం గోడపై  ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వరకూ కోట్లాది మంది ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన ఫోటోలను ఏర్పాటు చేశారు. 

ఇకపోతే విజయ స్థూపం కింది భాగం గ్రౌండ్ అంతా బెంగళూరు గ్రాస్ తో గార్డెన్ గా నిర్మించారు వైసీపీ శ్రేణులు. ఇకపోతే పైలాన్ కు 15 అడుగుల మెట్లు ఉండేలా నిర్మించారు. ఈ 15 అడుగులలో మెుదటి అడుగు జగన్ ప్రజా సంకల్పయాత్ర మెుదటి అడుగుగా చెప్పుకొస్తున్నారు. 

ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభించిన మెుదటి అడుగుగా మెుదటి మెట్టును తీర్చిదిద్దారు. ఆ తర్వాత 13 మెట్లను 13 జిల్లాలకు గుర్తుగా నిర్మించారు. 15వ మెట్టు జగన్ చివరి అడుగు ఇచ్చాపురంలో పెట్టినందుకు గుర్తుగా నిర్మించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.  
 
ఇకపోతే మూడు అంతస్థుల విజయ సంకల్ప స్థూపం మెుదటి అంతస్థులో నవ్యాంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను గుర్తుకు తెచ్చేలా మెుట్లు నిర్మిస్తే ఇక రెండవ అంతస్థులో వైఎస్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు గుర్తుకు ఆయన నిలవెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిలువెత్తు చిత్రపటాన్ని గేలాక్సీ గ్రానైట్లతో రూపొందించారు. 

మూడో అంతస్థులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి చిత్ర పటాలను నిర్మించారు. సంక్షేమ రథసారధిగా వైఎస్ఆర్ ను గుర్తుకు తెస్తూ నాలుగు వైపులా ఆకర్షణీయంగా చిత్రపటాలను పొందుపరిచారు.  

ఇకపై భాగంలో దేశంలో అత్యున్నత స్థానం అయిన పార్లమెంట్ కు చిహ్నంగా గుమ్మటాన్ని నిర్మించి దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జెండా రెపరెపలాడేలా విజయ సంకల్ప స్థూపాన్ని తీర్చిదిద్దారు. 

ఒకవైపు 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన మరోవైపు హౌరా–చెన్నై రైల్వే లైనుల మధ్య ఈ పైలాన్ రూపుదిద్దుకుంటుంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి దృష్టిని ఈ కట్టడం ఆకర్షించేలా వైసీపీ ప్రణాళిక రచించింది. 

ఇకపోతే ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాపురం టౌన్ కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ విజయ సంకల్ప స్థూపాన్ని నిర్మించారు.  

వీటితోపాటు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారో తెలియజేసేలా మ్యాప్ ను సైతం ఇందులో పొందుపరిచారు. ఈ అద్భుత కట్టడాన్ని వైఎస్ జగన్ అశేష జనవాహిని సమక్షంలో ఆవిష్కరించారు. ఈ స్థూపాన్ని తిలకించేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పాదయాత్ర: చారిత్రక ఘట్టానికి అద్భుత చిహ్నం పైలాన్

జగన్ ప్రజా సంకల్పయాత్ర: రెడీ అవుతున్న భారీ స్థూపం

Follow Us:
Download App:
  • android
  • ios